బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (12:51 IST)

ఆ ఇద్దరు నేతలపై గట్టి నమ్మకం పెట్టుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు

kolikapudi srinivasa rao
తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇందుకోసం ఇరు పార్టీలు కలిసి 99 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రటించాయి. ఇందులో టీడీపీకి చెందిన 94 మంది అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారు. ఈ జాబితాలో ఇద్దరు దళిత నేతలు కూడా ఉన్నారు. గత కొంతకాలంగా దళితుల సమస్యలపైనే కాదు, ప్రజా సమస్యలపైనా ఎలుగెత్తుతున్న ఆ నేతలే కొలికపూడి శ్రీనివాసరావు, మహాసేన రాజేశ్. వీరిద్దరిపై టీడీపీ అధినేత చంద్రబాబు గట్టి నమ్మకం ఉంచారు.
 
కొలికపూడి శ్రీనివాసరావుకు తిరువూరు టికెట్ కేటాయించారు. అలాగే, పి.గన్నవరం నుంచి మహాసేన రాజేశ్ కు అవకాశం ఇచ్చారు. దళితనేతగా గుర్తింపు ఉన్న కొలికపూడి శ్రీనివాసరావు గతంలో సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వహించారు. అమరావతి రాజధాని సంక్షోభం మొదలయ్యాక రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రైతుల తరపున ఆయన పోరాడిన విధానం అందరినీ ఆకట్టుకుంది. కొలికపూడి ఇటీవలే టీడీపీలో చేరారు. ఆయన ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు.
 
ఇక సరిపెళ్ల రాజేశ్ కుమార్ అలియాస్ మహాసేన రాజేశ్‌ మాత్రం మరోకథ. మహాసేన రాజేశ్ గత ఎన్నికల వరకు వైసీపీతో సన్నిహితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి బలమైన మద్దతుదారు అనే గుర్తింపును సొంతం చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మహాసేన రాజేశ్ ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపించడం మొదలుపెట్టారు. తన యూట్యూబ్ చానల్ ద్వారా వైసీపీ సర్కారును ఏకిపారేస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. మహాసేన రాజేశ్ జనసేనలో చేరతారని భావించినప్పటికీ, ఆయన టీడీపీలోకి వచ్చారు.