17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 17వ తేదీన మరోమారు సమావేశమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఓ ప్రకటనలో తెలిపారు. వెలగపూడి సచివాలయం మొదటి భవనంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమవుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. క్యాబినెట్‌కు సంబంధించిన ఆయా శాఖల ప్రతిపాదనలను ఈ నెల 16వ తేదీలోగా పంపించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా గీత కులాలకు కేటాయించే మద్యం షాపుల కేటాయింపు, మద్యం ధరల పెంపుపై చర్చించనుంది. అలానే ఇతర కీలక అంశాలపై క్యాబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ తర్వాత మరుసటి రోజు సీఎం చంద్రబాబు బృందం దావోస్‌లో జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లనుంది.
కాగా, ఈ నెల 2న ఏపీ క్యాబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో 14 కీలక అంశాలపై చర్చించి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతిలో రూ.2,733 కోట్ల విలువైన పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెల్సిందే.