శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (09:19 IST)

వలంటీర్లకు ముకుతాడు వేసిన ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే వీరంతా వైకాపా కార్యకర్తలు. ఎన్నికల సమయంలో నయానో  భయనానో భయపెట్టి అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయిస్తున్నారన్ని బహిరంగ రహస్యం. అయితే, ఇపుడు గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల విధుల నుంచి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 
 
ఏ అభ్యర్థి తరపున కూడా వారు పోలింగ్‌ ఏజెంట్లుగా వ్యవహరించకూడదని పునరుద్ఘాటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా గురువారం ఉత్తర్వులిచ్చారు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు ఈ ఆదేశాల్ని రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు వెంటనే తెలియజేయాలని.. అవి తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని కోరారు. 
 
వైకాపా కార్యకర్తలే వాలంటీర్లుగా ఉన్నారని, ఆ పార్టీ నాయకులు, మంత్రులే స్వయంగా ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో వెల్లడించారని పేర్కొంటూ ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. 
 
ఫలితంగా ఓటర్ల నమోదు, తొలగింపు, చేర్పులు, మార్పులు, ఓటర్ల జాబితా ప్రచురణ, పోలింగ్‌ కేంద్రాల ఎంపిక, ఎన్నికల రోజున ఓటరు చీటీల పంపిణీ, పోలింగ్‌ ఏర్పాట్లు, పోలింగ్‌ విధులు, ఓట్ల లెక్కింపు వంటి ఎన్నికలకు సంబంధించిన విధుల్లో వాలంటీర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాల్గొనకూడదు. క్షేత్రస్థాయిలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు వాలంటీర్లకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులూ అప్పగించరాదుని స్పష్టం చేశారు.