శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 18 మే 2022 (18:24 IST)

ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్య‌త‌లు స్వీక‌రించనున్న ముఖేష్ కుమార్ మీనా

సీనియ‌ర్ ఐఎఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. ప్రస్తుతం సిఇఓగా ఉన్న విజయానంద్ స్థానంలో 1998 ఐఎఎస్ బ్యాచ్ కు చెందిన మీనాను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన విషయం విదితమే. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్ సైతం వెలువడగా, 19వ తేదీ మధ్యాహ్నం 12.06 గంటలకు సచివాలయంలో ప్రధాన ఎన్నికల అధికారిగా చార్జి తీసుకోనున్నారు.

 
అనంతరం విజయానంద్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిశ్రమలు (ఆహార శుద్ది), ఆర్ధిక (వాణిజ్య పన్నులు), చేనేత జౌళి శాఖ కార్యదర్శిగా ఉన్న మీనాకు ఈ పదవితో కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లయ్యింది. తన సర్వీసులో భాగంగా విభిన్న పదవులను అలంకరించిన మీనా తనదైన శైలిలో పనిచేసి ప్రజల మన్ననలు అందుకున్నారు.

 
త‌న‌ పదవీ కాలంలో నెల్లూరు, విశాఖపట్నంలలో అసిస్టెంట్ కలెక్టర్, ఐటిడిఎ పిఓ, కర్నూలు జాయింట్ కలెక్టర్, ప్రకాశం, కర్నూలు కలెక్టర్, సిఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్, విశాఖపట్నం నగర పాలక సంస్థ కమీషనర్, క్రీడాభివృద్ది సంస్థ ఎండి, ఖనిజాభివృద్ది సంస్థ ఎండి, రాష్ట్ర విభజన వంటి అత్యంత కీలక సమయంలో హైదరాబాద్ కలెక్టర్, జిఎడి కార్యదర్శి పదవులలో మీనా రాణించారు.

 
ప‌ర్యాట‌క‌, భాషా, సాంస్కృతిక‌, పురావ‌స్తు శాఖ కార్య‌ద‌ర్శిగా మీనా అధ్బుతాలు సృష్టించార‌నే చెప్పాలి. అంత‌ర్జాతీయ స్ధాయిలో నిర్వ‌హించిన ప‌వ‌ర్ బోట్ రేసింగ్‌, బెలూన్ ఫెస్టివ‌ల్ వంటివి ఆంధ్రప్ర‌దేశ్‌ను అంత‌ర్జాతీయ ప‌ర్యాట‌క ప‌టంపై నిలిపాయి. ప్ర‌సాద్‌, స్వ‌దేశీ ద‌ర్శ‌న్, సాగ‌ర‌మాల వంటి కేంద్ర ప్ర‌భుత్వ ప‌ధ‌కాల ద్వారా ఆంధ్రప్ర‌దేశ్‌కు అత్య‌ధికంగా నిధులు విడుద‌ల చేయించిన ముఖేష్ కుమార్ మీనా, అయా పనుల‌ను సైతం నిర్ణీత‌ కాల వ్య‌వ‌ధిలో పూర్తి చేయించి ప్ర‌భుత్వ మ‌న్న‌న‌లు పొందారు.

 
అవాంత‌రాల‌ను అధిక‌మిస్తూ రాష్ట్రాన్ని ప‌ర్యాట‌కాంధ్ర‌గా రూపుదిద్దే ప్రయత్నంలో విజయం సాధించారు. ఈ రెండెళ్ల‌లో  అంత‌ర్జాతీయ సంస్ధ‌లు, కేంద్ర‌ ప్ర‌భుత్వం నుండి 36 అవార్డులు ప‌ర్యాట‌క శాఖను వ‌రించ‌గా, వ‌రుస‌గా రెండుసార్లు కేంద్రం నుండి స‌మీకృత ప‌ర్యాట‌క అభివృద్ది సాధించిన రాష్ట్రంగా ఎపిని నిల‌ప‌టం చిన్న విష‌యం కాదు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంతో సహా రెండు పర్యాయాలు అబ్కారీ క‌మీష‌న‌ర్‌గా విధులు నిర్వ‌హించిన మీనా అత్యంత ప్ర‌తిభావంతమైన అధికారిగా పేరు గడించారు. అక్ర‌మ మ‌ద్యానికి అడ్డుక‌ట్ట వేస్తూ జాతీయ స్ధాయిలో ఖ్యాతి గ‌డించి అప్పట్లో ఎన్నికల కమీషన్ అభినందనలు అందుకున్నారు.

 
ఎన్నికల తుదుపరి సాంఘిక‌, గిరిజ‌న సంక్షేమ శాఖ‌ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా గిరిజనుల సంక్షేమం విషయంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు వారి అభివృద్దికి బాటలు వేసాయి. ఆర్ఓఆర్ యాక్టు అమలు విషయంలో పారదర్శకంగా, సమర్ధవంతంగా వ్యవహరించారు. కొద్ది నెలల వ్యవధిలోనే అత్యంత కీలకమైన రాజ్ భవన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. నూతన రాజ్ భవన్ వ్యవస్థకు అంకురార్పణ చేసి, అతితక్కువ కాలంలోనే దానికి ఒక రూపును తీసుకువచ్చారు. అత్యాధునిక సాంకేతికత ఆలంబనగా కార్యకలాపాలు జరిగేలా స్పష్టమైన ప్రణాళికలు అమలు చేసి రాజ్ భవన్ ప్రతిష్టను ఇనుమడింపచేసారు. స‌మ‌ర్థుడు, సౌమ్యునిగా పేరున్న మీనా 2024 సాధారణ ఎన్నికల వేళ ప్రధాన ఎన్నికల అధికారిగా రావటం విశేషం.