వెలుగు చూస్తున్న హెచ్.ఎం.పి.వి కేసులు.. అప్రమత్తమైన ఏపీ సీఎం చంద్రబాబు
దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బెంగుళూరులో రెండు కేసులు నమోదు కాగా, తాజాగా అహ్మదాబాద్, చెన్నై నగరాల్లో మరో రెండు కేసులు నమోదైనట్టు సమాచారం. దీంతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రమత్తమయ్యారు. వైద్య శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హెచ్.ఎం.పి.వి వైరస్ కేసులపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే, రాష్ట్రంలో ఎక్కడా కూడా అనుమానిత హెచ్.ఎం.పి.వి కేసులు లేవని వారు సీఎంకు వెల్లడించారు.
కర్నాటక, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే సీఎం బాబు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాకపోయినప్పటికీ రాష్ట్రానికి వచ్చి వెళ్లే వారిపై దృష్టిసారించాలని, అనుమానం ఉంటే పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాలని సీఎఁ ఆదేశాలు జారీచేశారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖామంత్రి అనగాని సత్యకుమార్ కూడా పాల్గొన్నారు.
భారత్‌లో విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్...
చైనాలో విస్తృతంగా ప్రబలుతున్న హ్యూమన్ మెటాన్యూమా వైరస్ ఇపుడు భారత్‌లో కూడా వ్యాపించింది. ఇప్పటికే బెంగుళూరు నగరంలో రెండు కేసులు నమోదయ్యాయి. తాజాగా గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్టు తెలుస్తుంది. దీంతో దేశంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.
కర్నాటక రాష్ట్రంలో మూడు నెలల పసికందుకు, ఆరు నెలల బాలుడుకి ఈ వైరస్ సోకిన విషయం తెల్సిందే. ఆరు నెలల బాలుడు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో బాధపడుతున్నాడు. వైద్య పరీక్షలు చేస్తే హెచ్.ఎం.పి.వి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.
మరోవైపు, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‍తో బాధపడుతున్న రెండు నెలల పసిబిడ్డను గత నెల 24వ తేదీన అహ్మదాబాద్ ఆస్పత్రిలో చేర్చగా ఆ బాలుడికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.