1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 6 జూన్ 2024 (14:41 IST)

ఏపీలో కీలక పరిణామం : సెలవుపై వెళ్లిన సీఎస్ జవహర్ రెడ్డి!

jawar reddy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లిపోయారు. ఆయనను సాధారణ సెలవుపై వెళ్ళాల్సిందిగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) గురువారం ఆదేశించింది. దీంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు. నిజానికి ఆయన ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సివుంది. అయితే, ఇపుడు ఆయన సెలవుపై వెళ్లడం గమనార్హం. పైగా, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించే అవకాశాలు లేకపోలేదు. అలాగే, గురువారం సాయంత్రంలోగా కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. మరోవైపు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్‌ కూడ సెలవుపై వెళ్లిపోయారు. అనారోగ్య కారణాలతో ఆయన సెలవు పెట్టినట్టు సమాచారం. 
 
ఇదిలావుంటే, ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు సలహాదారులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అయితే, ఇప్పటివరకు రాజీనామా చేయని ప్రభుత్వ సలహాదారులను తక్షణమే తొలగించాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వైకాపా ఓటమి తర్వాత ఏపీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ యర్రంరెడ్డి నాగిరెడ్డి, అదనపు పీపీ దుష్యంత్ రెడ్డిలు కూడా రాజీనామాలు సమర్పించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెల్సిందే.