మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (15:08 IST)

మర్కజ్‌కు వెళ్లలేదు... చానెల్‌పై పరువునష్టం : ఏపీ డిప్యూటీ సీఎం

తాను ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన మతపరమైన కార్యక్రమానికి వెళ్లి వచ్చినట్టు వార్తలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ తోసిపుచ్చారు. తాను మర్కజ్‌కు వెళ్ళలేదని తెలిపారు. పైగా, తాను మర్కజ్‌లో పాల్గొన్నట్టు వచ్చిన అసత్య వార్తలను ప్రసారం చేసిన టీవీ చానెళ్ళపై పరువు నష్టందావా వేయనున్నట్టు తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మార్చి 2వ తేదీన ఢిల్లీకి వెళ్లాను. ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశాను. మర్కజ్‌కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశాను' అని వివరణ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 15, 16వ తేదీల్లో మర్కజ్‌ సమావేశాల్లో పాల్గొన్నారని చెప్పారు. 
 
అయితే, తాను మాత్రం మార్చి రెండో తేదీన ఢిల్లీకి వెళ్లి మరుసటి రోజునే తిరిగి వచ్చినట్టు తెలిపారు. ఆ తర్వాత నాలుగో తేదీన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నానని, ఐదో తేదీన కడపలోనే ఉన్నానని అంజద్‌ బాషా వివరణ ఇచ్చారు. 
 
అయితే, తాను మర్కజ్ ప్రార్థనలకు వెళ్లినట్లు మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నిజాలు తెలుసుకోకుండా తనపై దుష్ప్రచారం చేసిన ఛానల్‌పై పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. తాను ఆ సభలకు వెళ్లలేదని నిరూపించుకుంటే ఆ ఛానల్‌ను మూసేస్తారా? అని ప్రశ్నించారు.