గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 30 డిశెంబరు 2020 (22:37 IST)

గుంటూరు రెడ్‌క్రాస్ రక్త నిధిలో రక్త కణ విభజన కేంద్రంను ప్రారంభించిన గవర్నర్

విజయవాడ: అన్నిదానాలలోకెల్లా రక్తదానం అత్యంత విలువైనదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ అధ్యక్షుడు మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ప్రతి ఒక్క రక్తదాత మరొకరికి జీవితాన్ని ఇచ్చినట్లే నన్నారు.

గుంటూరు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రక్త కణ విభజన కేంద్రంను ప్రారంభించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి వీడియో లింక్ ద్వారా వర్చువల్ మోడ్‌లో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్మా, ప్లేట్‌లెట్స్, ఎర్ర రక్తకణాల కోసం కాంపోనెంట్స్ సెపరేషన్ యూనిట్, బ్లడ్ కలెక్షన్ వ్యాన్ కోసం రూ. 1.45 కోట్లను రోటరీ ఇంటర్నేషనల్, రోటరీ ఫౌండేషన్, రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్ష్ సమకూర్చాయి.
 
ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ ఎపి స్టేట్ బ్రాంచ్, యూనిట్ల కార్యనిర్వాహకులు, సిబ్బంది, వాలంటీర్లు ప్రజా సేవలో తమదైన కృషి చేస్తున్నారని ప్రశంసించారు. కోవిడ్ -19 లాక్ డౌన్. అనంతర కాలంలో విభిన్న సేవలు అందించటమే కాక,  రెడ్‌క్రాస్ వాలంటీర్లు నిత్యం రక్తదాన శిబిరాలను నిర్వహించి 813 తలసేమియా పిల్లలకు 4,294 యూనిట్ల రక్తాన్ని అందించడం విశేషమైన విజయమన్నారు. 
 
రక్త కణ భాగాలను వేరు చేసే విభాగం ఏర్పాటు చేయటంలో రెడ్‌క్రాస్‌తో చేతులు కలిపినందుకు రోటరీ సంస్ధలను గవర్నర్ శ్రీ హరిచందన్ అభినందించారు. ఇది రక్తం అవసరమైన వారి విషయంలో మరింత అంకితభావంతో సేవ చేయడానికి ఉపకరిస్తుందన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ, గుంటూరు జిల్లా శాఖ 1937 లో స్దాపించగా, ప్రసూతి గృహం, అనాథాశ్రమం, బ్లడ్ బ్యాంక్ వంటి సౌకర్యాలతో సేవలు అందిస్తోంది.

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముఖేష్ కుమార్ మీనా, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎపి స్టేట్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి  ఎ.కె. పారిడా, గుంటూరు జిల్లా కలెక్టర్, ఐఆర్‌సిఎస్ జిల్లా శాఖ అధ్యక్షుడు శామ్యూల్ ఆనంద్, రోటరీ ఇంటర్నేషనల్ అధ్యక్షుడిగా ఎన్నికైన శేఖర్ మెహతా, గుంటూరు రెడ్ క్రాస్ యూనిట్ చైర్మన్ వడ్లమణి రవి తదితరులు పాల్గొన్నారు.