మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 జూన్ 2021 (14:11 IST)

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులు - జూలై ఒకటి నుంచి వర్తింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కట్టడికి కొనసాగుతున్న కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 1వ తేదీ నుంచి 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. 
 
జూలై 1వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. 
 
మరోవైపు, కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయని తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని.. అటు రాత్రి 6 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. 
 
మరోవైపు జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపులు ఉన్న నేపథ్యంలో బ్యాంకుల టైమింగ్స్‌లోనూ మార్పులు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని బ్యాంకులు అన్ని కూడా ఎప్పటిలానే సాధారణ సమయాల్లో పని చేసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన ఐదు జిల్లాల్లో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పని చేయనున్నట్లు సమాచారం.