సీఆర్డీఏ చట్టం రద్దు : అర్థరాత్రి రహస్యంగా 4 జీవోలు జారీచేసిన సర్కారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆ కాసేపటికే ఆ విషయాన్ని గెజిట్‌లో ఏపీ సర్కారు నోటిఫై చేసింది. అదేసమయంలో సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటిన్ డెవలప్‌మెంట్ ఏరియా (ఏఎంఆర్‌డీఏ)ని ఏర్పాటు చేస్తూ శనివారం నాలుగు కాన్ఫిడెన్షియల్ (రహస్య) జీవోలు విడుదల చేసింది. వీటిని పురపాలక శాఖ విడుదల చేసింది.
అయితే, వాటిలోని విషయాన్ని మాత్రం రహస్యంగా ఉంచుతూ వాటిని కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొంది. కొత్తగా ఏఎంఆర్‌డీఏని ఏర్పాటు చేస్తూ తీసుకొచ్చిన ఈ జీవోల్లో గతంలోని ఏపీసీఆర్‌డీఏ పరిధిలోని మొత్తం ప్రాంతాన్ని ఏఎంఆర్‌డీఏ పరిధిలోకి తీసుకొచ్చారా? లేకుంటే, ఏమైనా మార్పులు చేశారా? అన్న విషయం మాత్రం తెలియరాలేదు.
అంతకుముందు.. సీఆర్డీయే రద్దు బిల్లు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించిన నేపథ్యంలో, ఏపీ సర్కారు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఆర్డీయే రద్దు, వికేంద్రీకరణ చట్టాలను నోటిఫై చేస్తూ వేర్వేరుగా గెజిట్లు రూపొందించారు.
ఆయా గెజిట్లలో నిర్దేశిత చట్టాలకు సంబంధించిన ఉద్దేశం, అమలు విధివిధానాలు, పరిధి తదితర అంశాలు పొందుపరిచారు. ఈ గెజిట్లను ఏపీ ప్రభుత్వం తరపున న్యాయశాఖ విడుదల చేసింది. కాగా, మూడు రాజధానుల అంశం ఇపుడు ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.