శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (12:34 IST)

అమరావతిలో నవశకం... న్యాయపాలన ఇక్కడే : శాశ్వత భవనాలకు శంకుస్థాపన

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి ఇకపై న్యాయపాలన జరుగనుంది. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో హైకోర్టు తాత్కాలిక భవనాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ఆదివారం ప్రారంభించారు. సీఆర్‌డీఏ పరిధిలోని నేలపాడులో ఈ భవనాన్ని నిర్మించారు. 
 
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టులోని తెలుగు న్యాయమూర్తులు జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ, జస్టిస్‌ నాగేశ్వరరావు, జస్టిస్‌ సుభాష్‌రెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, కొందరు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి ఈనెల 15వ తేదీ తర్వాత కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 
 
ఇదిలావుంటే, ఏపీ హైకోర్టు శాశ్వత నిర్మాణానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ ఆదివారం శంకుస్థాపన చేశారు. అమరావతిలో నిర్మించనున్న హైకోర్టుకు భూమి పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ లావు నాగేశ్వరరావు, ఏపీ, తెలంగాణ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరయ్యారు. బౌద్ధ స్ఫూపాకృతిలో హైకోర్టు శాశ్వత భవనాన్ని నిర్మించనున్నారు. 450 ఎకరాల్లో రూ.820 కోట్ల ఖర్చుతో 12.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుంది.