శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2020 (17:34 IST)

పూటకో మాట మాట్లాడుతారా? సీఎం - మంత్రులకు హైకోర్టు నోటీసులు

రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశంపై హైకోర్టు మరోమారు షాకిచ్చింది. రాజధాని అంశంలో పూటకో మాట మాట్లడటంపై సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు.. రాష్ట్ర మంత్రులు బొత్స, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు నోటీసులు జారీచేసింది. 
 
రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారంటూ ఆ ప్రాంత రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చీరాగానే మరో మాదిరి జగన్ మాట మార్చారని పిటిషనులో రైతులు పేర్కొన్నారు. రాజధాని తరలింపుకు దురుద్దేశపూర్వకంగా చట్టాలు చేశారని రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర పార్టీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ఇదేవిషయమై హైకోర్టులో ఇతరులు కూడా పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను గురువారం హైకోర్టు విచారించింది. అన్ని పిటిషన్లకు కలిపి ఏపీ ప్రభుత్వం కేవలం ఒక్క కౌంటర్‌ను మాత్రమే దాఖలు చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రతి పిటిషన్‌కు ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఇదేకేసుకు సంబంధించి టీడీపీ, బీజేపీలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేసింది.
 
ఈ అంశంపై సెప్టెంబరు నెల 21వ తేదీ వరకు స్టేటస్ కో (యధాతథస్థితి)ను పొడిగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. సెప్టెంబర్ 21 నుంచి ప్రతి రోజూ ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని చెప్పింది. ఈ విచారణను ప్రత్యక్షంగా నిర్వహించాలా? లేదా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించాలా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని తెలిపింది.