శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (16:57 IST)

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం : జిల్లా కలెక్టర్ - డీహెచ్ఎంవో కూడా బాధ్యులే కదా?

విజయవాడలోని రమేష్ ఆస్పత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అనుమతితో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటైంది. అయితే, దురదృష్టవశాత్తు ఈ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది చనిపోయారు. ఇదే అసమయంలో రమేష్ ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్‌ తనను అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు సుధీర్ఘంగా విచారణ జరిపింది. 
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత డాక్టర్ రమేష్‌తో పాటు ఆస్పత్రిపై కూడా చర్యలు తీసుకోకుండా హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏళ్ల తరబడి హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కోర్టు తెలిపింది. హోటల్‌లో కోవిడ్ నిర్వహణకు అధికారులు అనుమిచ్చారన్న విషయాన్ని కూడా కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది. 
 
అంతేకాకుండా, ఈ కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది కూడా ప్రభుత్వ అధికారులేనని స్పష్టం చేసింది. ముఖ్యంగా, అనుమతులు మంజూరు చేసిన జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీహెచ్ఎంవో కూడా ఈ అగ్ని ప్రమాదానికి బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసులో అధికారులనూ నిందితులను చేరుస్తారా..? అని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. 
 
అంతేకాదు.. డాక్టర్ రమేష్‌ను అరెస్ట్ చేయకుండా ఉంటారా..? తామే ఉత్వర్వులు ఇవ్వాలా..? అని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ తరఫు న్యాయవాది కేసు ఇంకా విచారణ దశలోనే ఉందని కోర్టుకు తెలిపారు.