సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 23 ఆగస్టు 2020 (19:58 IST)

ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య, రెండో భార్యకు అదిచ్చాడని అనుమానంతో...

భర్తను స్వయంగా భార్యే చంపించిన సంఘటన జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకుంది. ‌తాండూర్ డిఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... తాండూర్ మండలం చెంగొల్ గ్రామానికి చెందిన నడిమింటి నాగరాజ్ ఈనెల 12వ తేదీ నుంచి కనబడకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల దగ్గర తెలిసిన వారి దగ్గర అతని గురించి ఆరా తీసారు. నాగరాజు ఆచూకీ తెలియకపోవడంతో 14 తేదీన నాగరాజ్ కూతురు శ్రీయ గౌడ్ కరణ్ కోట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. నాగరాజుకు ఇద్దరు భార్యలు ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు వాళ్ల ఫోన్ డీటెయిల్స్ ఆరా తీయగా నాగరాజు మొదటి భార్య లక్ష్మి గ్రామానికి చెందిన బాలరాజుతో అక్రమ సంబంధం ఉందని తెలియడంతో ఆ కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. మొదటి భార్యని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరపడంతో నాగరాజును తామే చంపామని నిజం బయటపడింది. 
 
నాగరాజ్ రెండవ భార్యకు ఆస్తిని రాసి ఇస్తున్నాడనే విషయం లక్ష్మికి తెలిసింది. ఎలాగైనా భర్త నాగరాజును చంపేస్తే ఆస్తి తనకు దక్కుతుందన్న ఉద్దేశంతో అక్రమ సంబంధం పెట్టుకున్న బాలరాజుతో గత మూడు నెలల నుంచి హత్యకు సంబంధించి పథకం రచించారు. 12 తేదీన రాత్రి 10 గంటల సమయంలో నాగరాజు ఇంట్లో పడుకొని ఉండగా లక్ష్మి ప్రియుడైన బాలరాజు ఫోన్ చేసింది.
 
బాలరాజు అతనితోపాటు శాఖమల్ల శంకర్, పండ్ల పవన్ కుమార్‌కు తల లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి వారిని లక్ష్మి ఇంటికి తీసుకెళ్లాడు. నిద్రపోతున్న భర్తను లక్ష్మి ఇనుప రాడ్‌తో ఛాతి, ఎడమ కాలిపై గట్టిగా కొట్టడంతో గట్టిగా అరుస్తూ నాగరాజు నిద్ర లేచాడు. అంతలోనే అక్కడికి వచ్చిన ఆ ఇద్దరు నోరు మూసి గొంతు నులిమి చంపేశారు.
 
ముందుగా వేసుకున్న పథకం ప్రకారం చనిపోయిన నాగరాజు మృతదేహాన్ని బాల్రాజ్ గ్రామానికి చెందిన అజ్జు అనే వ్యక్తి ఆటో సహాయంతో తీసుకెళ్లారు. ఆ మృతదేహాన్ని సిమెంట్ పోల్‌కి తాడుతో కట్టి గొల్లచెరువులో పడవేశామని నిందితులు ఒప్పుకోవడంతో 21 తేదీన చెరువులో గాలించి శవాన్ని బయటకు తీసి ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.