గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (15:31 IST)

ఎస్ఈసీకి జగన్ సర్కారు సహాయ నిరాకరణపై హైకోర్టు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సర్కారుపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ముఖ్యంగా, రాజ్యాంగ సంస్థగా ఉన్న రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహాయ నిరాకరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదనీ, ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సరిగా నిధులను ఇవ్వడం లేదంటూ అక్టోబర్ 21న హైకోర్టులో నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల కమిషన్‌కు నిధులను నిలిపివేయడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(కే) ప్రకారం చట్ట విరుద్ధమని పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై ప్రభుత్వం, నిమ్మగడ్డ తరపు వాదనలను న్యాయస్థాయం ఆలకించింది. నిజాయితీగా పనిచేసే అధికారులను ఇబ్బందులకు గురిచేయటం మంచికాదని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
తనకు అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లి న్యాయంగా పదవి పొందిన వ్యక్తిని... ప్రభుత్వం కావాలనే ఎస్ఈసీకి సహాయ సహకారాలందించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. 
 
ఎన్నికల కమిషన్ అనేది స్వతంత్ర వ్యవస్థ అని.. నిరంతరంగా పనిచేసేదని, వ్యవస్థలను కాపాడుకుంటేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని, లేకపోతే కూలిపోతుందని న్యాయస్థానం సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
 
ప్రభుత్వం సహాయమందిస్తే ఎస్ఈసీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండేది కాదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎస్ఈసీ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వం నుంచి ఏం కావాలనేది ఎస్ఈసీ మూడు రోజుల్లోగా ప్రభుత్వానికి తెలియచేయాలని స్పష్టం చేసింది. 
 
ఎస్ఈసీ కోరినవన్నీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అమలు చేయకపోతే అప్పుడు ఏం చేయాలనేది రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందని స్పష్టంచేసింది. కాగా ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ అడ్వకేట్లు సీతారామ్మూర్తి, అశ్వనీకుమార్‌లు వాదనలు వినిపించారు.