సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (10:12 IST)

రాజధాని అమరావతి పిటిషన్లపై నేటి నుంచి రోజువారి విచారణ

నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో సోమవారం నుంచి రోజువారీ విచారణ జరుగనుంది. ముఖ్యంగా, సీఆర్డీఏ చట్టం రద్దు, పాలనా వికేంద్రీకరణ, రాజధాని తరలింపులపై అమరావతి రైతులు, ఇతర నేతలు 90కి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. 
 
ఈ పిటిషన్లను హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. ఈ వ్యాజ్యాలపై సోమవారం నుంచి రోజువారీ విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ కేసులను హైబ్రిడ్ పద్ధతుల్లో హైకోర్టు విచారించనుంది.
 
నిజానికి గత ఏడాది జనవరిలో ఈ పిటిషన్ల విచారణ కోసం జస్టిస్ మహేశ్వరి ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఆ బెంచ్ ముందు రైతుల తరపు న్యాయవాదులు వాదనలను వినిపించారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. 
 
అయితే జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ కావడంతో విచారణ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఈ క్రమంలో సీజేగా అరూప్ గోస్వామి రావడంతో ఈ కేసులు ఆయన ముందుకు వచ్చాయి. ఈ యేడాది ఆగస్టు 13న ఈ పిటిషన్లను ధర్మాసనం విచారించింది. ఆ సందర్భంగా తదుపరి విచారణను ఈ రోజుకు వాయిదా వేశారు. దీంతో అమరావతి పిటిషన్లపై రోజువారీ విచారణ జరగనుంది.
 
రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ వాదనలు వినిపించే అవకాశం ఉంది. రైతుల తరపు వాదనలు ముగిసిన తర్వాత, ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది.