శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (12:44 IST)

ఆంధ్రప్రదేశ్ నెత్తిన కొండలా రెవెన్యూ లోటు! : వెల్లడించిన కాగ్ నివేదిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తుందని కంప్ట్రోలర్ ఆఫ్ ఆడిటింగ్ జనరల్ (కాగ్) బహిర్గతం చేసింది. ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు ఆదాయానికి మించి విపరీతంగా పెరుగుతుండటంతో రాష్ట్ర రెవెన్యూ లోటు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతోందని కాగ్ ఆందోళన వ్యక్తం చేసింది. రెవెన్యూ లోటును పరిమితం చేస్తామని ఎప్పటికప్పుడు చెప్పడమే తప్ప, ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నలూ చేయడం లేదని కాగ్ తాజాగా బహిర్గతం చేసింది. 
 
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు అంచనా రూ.5000.06 కోట్లుగా బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. కానీ 2021-22 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు నెలాఖరు వరకు కాగ్‌ విడుదల చేసిన రాష్ట్ర ఆదాయ, వ్యయ లెక్కల ప్రకారం.. తొలి ఆరు నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.33,140.62 కోట్లకు చేరింది. 
 
ఈ లెక్కన బడ్జెట్‌లో ప్రతిపాదించిన మొత్తం కంటే రెవెన్యూ లోటు 662.80 శాతం పెరిగినట్టు. మిగతా ఆరు నెలలూ గడిచేసరికి రెవెన్యూ లోటు మరింత తీవ్రమయ్యే అవకాశముంది. 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రెవెన్యూ లోటును రూ.18,434.15 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంది. 2020 సెప్టెంబరు నెలాఖరుకు రూ.45,472.77 కోట్ల (మొత్తం బడ్జెట్‌ అంచనా కంటే 246.68శాతం ఎక్కువ)కు చేరింది. 
 
కిందటేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో రెవెన్యూ లోటు తగ్గినట్టు కనిపిస్తోంది. బడ్జెట్‌ అంచనాలతో పోల్చితే నిరుటి కంటే ఈ ఏడాది భారీగా పెరిగింది. 2021-22 బడ్జెట్‌లో ద్రవ్యలోటు అంచనా రూ.37,029.79 కోట్లుగా ప్రభుత్వం పేర్కొనగా, మొదటి ఆరు నెలల్లోనే రూ.39,914.18 కోట్లకు చేరింది. బడ్జెట్‌లో ఏడాది కాలానికి ప్రతిపాదించిన అంచనాల్ని ఆరు నెలల్లో దాటేయడమే కాకుండా, అదనంగా ఏడు శాతం లోటు నమోదవడం గమనార్హం.