డంపింగ్ యార్డును సింగ్‌నగర్ నుండి తరలిస్తాం... మంత్రి బొత్స
విజయవాడ సింగ్‌నగర్ వాంబే కాలనీ ప్రాంతం ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డును త్వరలో తరలించి అదే ప్రదేశంలో ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటుచేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సింగ్‌నగర్ వాంబేకాలనీ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును శుక్రవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ పరిశీలించారు.
అనంతరం మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ సింగ్‌నగర్ వాంబే కాలనీ పరిసర ప్రాంతవాసులకు ఎంతోకాలంగా ఇబ్బందికరంగా పరిణమించిన డంపింగ్ యార్డును త్వరలోనే ఇక్కడ నుండి తరలించి అదే ప్రదేశంలో ఒక ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. డంపింగ్ యార్డు పరిసర ప్రాంతంలో దాదాపు మూడు వేల కుటుంబాలు నివాసం ఉంటున్నాయన్నారు. ఇవేగాక త్వరలో కొత్తగా నిర్మించిన అపార్టుమెంట్లలో మరికొన్ని కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారన్నారు. ప్రజలు చెత్త డంపింగ్ యార్డు కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, డంపింగ్ యార్డు వలస వాతావరణ కాలుష్యంతోపాటు విపరీతమైన దోమల బెడదకు గురై అనారోగ్యం పాలవుతున్నామని తెలుపుతూ యార్డును తరలించమని ఎంతోకాలంగా కోరుతున్నారన్నారు.
అయితే సమస్య అప్పటి నుండి అపరిష్కృతంగానే ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసి ఆహ్లాదకరంగా మార్చమని సూచించారని ఆయన సూచనల మేరకు ఈ ప్రాంతాన్ని కూడా పరిశుభ్రంగా మారుస్తానికి చర్యలు తీసుకోబోతున్నామన్నారు. డంపింగ్ యార్డు రెండు భాగాలుగా ఉందని ఒక భాగంలో డంపింగ్ యార్డు మరో భాగంలో ట్రాన్సిట్ యార్డు ఉందన్నారు. డంపింగ్ యార్డు ఉన్న ప్రదేశంలో పార్కు ఏర్పాటుచేసి ఆహ్లాదకరంగా మారుస్తామన్నారు. ట్రాన్సిట్ యార్డులో ప్రాసెసింగ్ చేస్తున్నామని అధికారులు చెబుతున్నారని అయితే నివాసాల మధ్య ఇబ్బందికరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో రెండు మూడు నెలల్లో ట్రాన్సిట్ యార్డును గుంటూరు జిల్లాలో ఏర్పాటుచేస్తున్న యార్డుకి తరలిస్తామన్నారు.
తర్వాత ఆ ప్రదేశాన్ని కూడా ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమానికి వినియోగిస్తామన్నారు. అదేవిధంగా ప్రజల త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి త్వరలోనే పైపులైన్లు ఏర్పాటుచేసి రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న మునిసిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ ఆప్రాంతంలో ఉన్న చెత్తను తరలించడానికి తీసుకుంటున్న చర్యలను జరుగుతున్న పనులను మంత్రులకు వివరించారు.
డంపింగ్ యార్డును పరిశీలించిన మంత్రులు తదుపరి ఉడా కాలనీలో ఉన్న తెలుగుతల్లి పార్కును పరిశీలించారు. ఆపార్కును కూడా త్వరలోనే అభివృద్ధి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మునిసిపల్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి చేసిన పార్కును స్థానికులు వినియోగించుకొని పార్కు నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. డంపింగ్ యార్డు పరిశీలనలో మునిసిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్, మునిసిపల్ కార్పోరేషన్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.