బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (16:26 IST)

ఉచిత గ్యాస్ పథకాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు : నాదెండ్ల మనోహర్

nadendla manohar
రాష్ట్రంలోని టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని, ఏపీ పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకంపై శాసన మండలిలో అధికార, విపక్ష సభ్యుల మధ్య సోమవారం తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ సమాధానంపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ పదేపదే ప్రశ్నలు వేశారు. ఆయనకు మంత్రి నాదెండ్ల, పయ్యావుల గట్టిగా బదులిచ్చారు.
 
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ సమాధానమిస్తూ, అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చినందుకు ప్రతిపక్ష సభ్యులు తట్టుకోలేక పోతున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయని.. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ అందజేస్తామన్నారు. 
 
ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్‌ చేసుకున్నారని.. 30లక్షల మందికి అందజేశామని వివరించారు. ఉచిత గ్యాస్‌ సిలిండర్ పూర్తి పారదర్శకంగా జరుగుతున్న కార్యక్రమమని చెప్పారు. మార్చి 31, 2025 వరకు మొదటి సిలిండర్‌ బుక్‌ చేసుకోవచ్చన్నారు. దీనికోసం పూర్తి నిధులు కేటాయించామని.. ఎవరికీ అనుమానాలు అవసరం లేదన్నారు.