పేదలకు వరం ఆరోగ్యశ్రీ పథకం

arogyasri
ఎం| Last Updated: సోమవారం, 20 జులై 2020 (21:04 IST)
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రారంభించిన వినూత్న పథకం ఆరోగ్యశ్రీ కోట్లాది ప్రజల మనస్సు గెలుచుకుందని సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ మరియు ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.


గుండెలో రంధ్రాలు ఉన్న చిన్నారులకు ఆపరేషన్లతో ప్రారంభమైన ఈ పథకం పేదలకు ఒక వరంగా మారడమేగాక పథకం లబ్ధిని పొందని వారిలో కూడా భద్రతా భావాన్ని కలిగించిందన్నారు. రేపు తాము అనుకోని అనారోగ్యానికి గురైతే ఏమి జరుగుతుందో అనే చింతలేకుండా ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఆరోగ్య సంరక్షణ వారికి ప్రశాంతంగా నిద్రపోయేలా భరోసా కల్పించిందన్నారు.

అయితే డాక్టర్ వెఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగతులైన తర్వాత కాలంలో ఆరోగ్యశ్రీ పట్ల సరైన శ్రధ్ధ చూపకపోవడంతో పాటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించని కారణంగా ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులు ముందుకురాని పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఈ పరిస్థితిలో వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన నూతన ప్రభుత్వం అనేక ఇతర ప్రయోజనాలను జోడించి ఆరోగ్యశ్రీని సమర్ధవంతంగా అమలు చేయడం ద్వారా ఈ పథకానికి నూతన జీవాన్ని ఇచ్చిందన్నారు.

గత పాలనలో పెండింగ్‌లో ఉన్న, రూ. 680 కోట్ల బిల్లులను నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించడమే గాక జూన్, 2019 నుండి ఇప్పటి వరకు రూ .1,915 కోట్ల బిల్లుల చెల్లింపులకు నిధులు విడుదల చేసిందన్నారు.


ఆరోగ్యశ్రీ కింద లబ్ధిపొందడానికి ఆదాయ పరిమితిని కూడా రూ. 5 లక్షలకు పెంచడం వలన రాష్ట్రంలోని మొత్తం 1.48 కోట్ల కుటుంబాలలో 1.42 కోట్ల కుటుంబాలు అంటే జనాభాలో 95% మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్గుతుందన్నారు.

అర్హత ఉన్న ప్రతి కుటుంబానికీ గ్రామ/వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకున్న 20 రోజులలో ఆరోగ్యశ్రీ కార్డును అందిస్తారని, ఈ కార్డులు క్యూఆర్ కోడ్ కల్గి ఉన్నందున రోగులకు సంబంధించిన డేటాను ఆరోగ్య రికార్డులను అందించడానికి వైద్యులకు ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఉన్న 150 కి పైగా సూపర్ స్సెషాలిటీ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ పరిధిలోకి తీసుకురావడం వల్ల పేదలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.

ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్లు చేయడమే కాకుండా దేశంలో ఎక్కడాలేని విధంగా రోగి కోలుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరా పథకం కింద రోజుకు రూ. 225 లేదా నెలకు రూ. 5,000 భత్యం డాక్టర్ సూచించినన్ని రోజులు చెల్లిస్తారన్నారు.

ఆరోగ్యశ్రీ కార్యక్రమంలో మరో ముందడుగు గా వైద్యం ఖర్చు రూ. 1000 దాటిన అన్ని చికిత్సలు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని, దీనిద్వారా 54 అధునాతన క్యాన్సర్ చికిత్సలతో పాటు, 2,200 వైద్యప్రక్రియలకు ఆరోగ్యశ్రీ క్రింద ఉచితంగా వైద్య సేవలు లభిస్తాయని ఆయన తెలిపారు.

మొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా జూలై 16 నుండి కర్నూలు, వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు విస్తరించడం జరిగిందన్నారు. నవంబరు 14 నాటికి మిగిలిన 6 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం క్రింద వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చే నాడు-నేడు కార్యక్రమం కింద రూ .16,000 కోట్ల వ్యయంతో 7,458 ప్రాథమిక ఆరోగ్య ఉప- కేంద్రాలు, 1,145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 52 ఏరియా ఆస్పత్రులు,169 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారన్నారు.


ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున 16 నూతన వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా మెరుగైన సేవలను అందించడానికి నర్సింగ్ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భయంకరమైన వ్యాధి నుండి ప్రజలను రక్షించడానికి క్రొత్తగా మూడు క్యాన్సర్ మరియు రెండు కిడ్నీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నారన్నారు.

అదేవిధంగా, కుష్టు వ్యాధి, పక్షవాతం మరియు డయాలసిస్ రోగులకు,ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెలవారీ రూ .3,000 నుండి 10,000 రూపాయల వరకు పెన్షన్లు ఇవ్వడం జరగుతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే పారిశుధ్య సిబ్బంది వేతనాలను రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకుపెంచారన్నారు.

అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు అందుబాటులో ఉంటున్నాయన్నారు. పేదలకు మెరుగైన మెడికల్ కౌన్సెలింగ్ అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 13 న వైఎస్సార్ టెలి-మెడిసిన్ కాల్ సెంటర్ 14410 ను ప్రారంభించిందన్నారు. ఆసుపత్రులలో ఒకేసారి 9,712 మంది వైద్య సిబ్బంది నియామానికి నోటిఫికేషన్ జారీ చేయగా ఈ పోస్టుల్లో ప్రస్తుతం ఉన్న ఖాళీలు 40 శాతం కాగా 60 శాతం పోస్టులు కొత్తగా రూపొందించడమైనదని తెలిపారు.

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడానికి అత్యాధునికి వైద్యసౌకర్యాలతో 1,088 కొత్త 104/108 అంబులెన్స్ లను అందుబాటులోకి తెచ్చామన్నారు. దాదాపు రూ. 1,000 దాటిన చికిత్సలన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకం కింద తీసుకురావడంతో పాటు ఆరు జిల్లాలకు 2,200 రకాల వైద్య సేవలను విస్తరించడం జరిగిందన్నారు.

ప్రస్తుత పరిస్థితులలో పేదలకు ఉపశమనం కలిగించడానికి కోవిడ్-19 రోగులకు అందించే చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. వైద్య సేవలను గ్రామీణ ప్రజలకు మరింత చేరువలోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా రూ. 16,200 కోట్ల వ్యయంతో 2021 ఏప్రిల్‌ నుండి 10 వేల వైఎస్సార్ విలేజ్ క్లిన్ లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమీషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.దీనిపై మరింత చదవండి :