కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
ఎపిలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 16వ తేది నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఎపి వ్యాప్తంగా 3,87,983 మంది ప్రభుత్వ, ప్రయివేటు వైద్యారోగ్య సిబ్బందికి తొలి విడతలో వ్యాక్సిన్ అందించనున్నారు.
ఇందుకోసం రాష్ట్రంలో 1,940 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐస్‌లైన్డ్ రిఫ్రిజిరేటర్లు, వాక్ ఇన్ ఫ్రీజర్ గదుల ఏర్పాటు కారణంగా 1,659 చోట్ల వ్యాక్సిన్ వయల్స్ కార్టన్లను వైద్య ఆరోగ్య శాఖ భద్రపరిచింది. ప్రతి కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందించారు. వ్యాక్సిన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
వ్యాక్సినేషన్ కోసం వచ్చే సిబ్బందికి ముందుగానే కొవిన్ యాప్ ద్వారా సంక్షిప్త సమాచారం అందుతుంది. వైద్య సిబ్బది గుర్తింపు కార్డులు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వ్యాక్సిన్ ప్రక్రియను కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద అత్యవసర వైద్య సిబ్బందిని నియమించారు.