శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 జనవరి 2021 (11:51 IST)

రాష్ట్రాలకు కదలిన క‌రోనా టీకా

కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకా సరఫరాకు ఉపక్రమించింది. పుణెలోని తయరీకేంద్రం నుండి టీకా డోసుల్ని మంగళవారం తెల్లవారుజామున మూడు ప్రత్యేక ట్రక్కుల ద్వారా కట్టుదిట్టమైన భద్రత నడుమ విమానాశ్రయానికి తరలించారు.

దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. సుమారు 32కిలోల బరువు ఉన్న 478 బాక్సుల్లో టీకాలను నింపినట్లు అధికారులు చెబుతున్నారు. ఎయిరిండియా, గోఎయిర్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌కు చెందిన 8 ప్రత్యేక, 2 కార్గో విమానాలను ఉపయోగిస్తున్నారు.

తొలివిడతలో పుణె నుండి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కలకత్తా, చెన్నై, బెంగుళూరు, కర్నాల్‌, హైదరాబాద్‌, విజయవాడ, గోవా, లక్నో, చండీగఢ్‌, భువనేశ్వర్‌కు చేరనున్నట్లు సమాచారం. మొదటి కార్గో విమానం హైదరాబాద్‌, విజయవాడ, భువనేశ్వర్‌కు రానున్నాయి. మరొకటి కలకత్తా, గోవా వెళ్లనున్నాయని ఓ అధికారి తెలిపారు.

ముంబయికి రహదారి మార్గం ద్వారా సరఫరా అవనుంది. ఈనెల 16 నుండి వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. ఇందులో 3కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు తొలి ప్రాధాన్యంలో ఉన్నారు. ఇంకోవైపు 12 రాష్ట్రాలకు భారత్‌బయోటెక్‌ టీకాలను సరఫరా చేయనుంది.

సీరం నుండి 1.1కోట్ల డోసులను, భారత్‌ బయోటెక్‌ నుండి 55 లక్షల డోసులను కేంద్రప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తొలివిడతలో 3కోట్ల మందికి టీకా ఇచ్చేందుకు అయ్యే ఖర్చును కేంద్రం భరించనుంది. ఏప్రిల్లో 4.5కోట్ల కోవిషీల్డ్‌ డోసులను కేంద్రం కొనుగోలు చేయనుంది. వీటి మొత్తం విలువ రూ.1300కోట్ల మేర ఉండనుంది.

సీరం సంస్థ తయారు చేసిన ఒక్కో కోవిషీల్డ్‌ డోసు ధర రూ.200లు. రూ.10 జిఎస్‌టి అదనంగా పడనుంది. ఇక కోవాగ్జిన్‌కు ఒక్కో డోసుకు రూ.295 చెల్లించనున్నట్లు సమాచారం.