సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 4 మే 2021 (19:20 IST)

అయ్యా, రేషన్ సరుకులు పంపించండి: సీఎం జగన్‌కు పి.అశోక్ బాబు లేఖ

రాష్ట్రంలో మే 1వతేదీ నుంచి రేషన్ కార్డుదారులకు అందజేయాల్సిన నిత్యావసర వస్తువుల పంఫిణీ, కేంద్రప్రభుత్వం కరోనా సందర్భంగా ప్రకటించిన ఉచితన రేషన్ బియ్యం పంపిణీ గత మూడురోజులుగా నిలచిపోయిందని సీఎం జగన్ మోహన్ రెడ్డికి శాసనమండలి సభ్యులు అశోక్ బాబు లేఖ రాశారు. రాష్ట్రంలో సుమారు 30వేలమంది డీలర్ల ద్వారా సాఫీగా నడుస్తున్న రేషన్ పంపిణీ వ్యవస్థను రేషన్ డోర్ డెలివరీ పేరుతో నిర్వీర్యం చేశారు.

గత రెండునెలలుగా ఇంటింటికీ రేషన్ పంపిణీ అని చెప్పి రోజువారీ కూలీ చేసుకునే పేదలను గంటల తరబడి రోడ్లపై నిలబెడుతూ నానా అగచాట్లకు గురిచేశారు. ఇప్పుడు రేషన్ వాహనదారుల సమ్మె కారణంగా ఆ పంపిణీ కూడా నిలచిపోయింది. రేషన్ డోర్ డెలివరీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 9,260 మందికి నిరుద్యోగులకు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండియు)  వాహనాలను రూ.539కోట్లు వెచ్చించారు, దీనికి అదనంగా ఏడాదికి జీతాల రూపంలో 230కోట్లు కలిపి మొత్తం 769కోట్లు  డోర్ డెలీవరీ పేరుతో అదనంగా ఖర్చుచేస్తున్నారు.

వాహనదారులకు పేరుకు నెలకు రూ. 21వేలు ఇస్తున్నామని చెబుతున్నారు. ఇందులో పెట్రోలుకు 5వేలు, సహాయకుడికి 5వేలు, ఇతర మెయింటెనెన్స్ తీసేస్తే వాస్తవానికి వారికి పదివేలు కూడా మిగలడం లేదు. ఫిబ్రవరి 1 నుంచి డోర్ డెలివరీ కోసం ఏర్పాటుచేసిన జగనన్న రేషన్ వాహనాలు నిరుద్యోగ యువతను మూటలు మోసే కూలీలుగా మార్చేశాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తమను ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించి బీమా, టీకా, మాస్క్, శానిటైజర్ వంటి సౌకర్యాలు కల్పిస్తేనే పంపిణీ చేస్తామంటూ వాహనదారులు గత నాలుగు రోజులుగా సమ్మెకు దిగారు. దీంతో రేషన్ పంపిణీ నిలచిపోయింది.

ఎండియు వాహనదారులు సమ్మెకు దిగడంతో పాతపద్ధతిలో పంపిణీ చేయాల్సిందిగా అధికారులు వత్తిడి తెస్తున్నారు. తమను దొంగలుగా చిత్రీకరించి బాధ్యతలనుంచి తప్పించినందున ప్రస్తుత పరిస్థితుల్లో తాము రేషన్ పంపిణీ చేయలేమని, కాదని వత్తిడి తెస్తే తాము కూడా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని డీలర్లు చెబుతున్నారు. ఎండియు వాహనదారులు  రేషన్ డోర్ డెలీవరీ వాహనదారులు ప్రతిరోజూ డీలర్ వద్ద నుంచి సుమారు 1000 నుంచి 1500 కిలోల బియ్యంమూటలను వారే మోసుకుని రావాల్సి ఉంటుంది.

ఈ-పాస్ యంత్రాల ద్వారా వినియోగదారులనుంచి అథెంటికేషన్ తీసుకొని రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ విధంగా ఒక్కో వాహనదారుడు రోజుకు 90మందికి చొప్పున నెలకు 18రోజులు పనిచేయాల్సి వస్తోంది. కరోనా సమయంలో ఒక్క విజయవాడలోనే ముగ్గరు డోర్ డెలీవరీ వాహనదారులైన యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటింటికీ వెళ్లి రేషన్ ఇవ్వాలని అంటున్నారని, కరోనా సమయంలో తమ ప్రాణాలకు ఎవరు రక్షణ కల్పిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వేలిముద్రలు తీసుకోలేమని, వీధిలో ఒక పాయింట్ వద్ద మాత్రమే బండిని ఉంచి పంపిణీ చేస్తామని చెబుతున్నారు.

దీంతో గతంలో వద్దని చెప్పిన రేషన్ డీలర్లనే తిరిగి రేషన్ పంపిణీ చేయాల్సిందిగా అధికారులు వత్తడి తెస్తున్నారు. ప్రస్తుతం రేషన్ డీలర్లకు ఈ-పాస్ యంత్రాలు నిర్వహించే అధికారం లేకపోగా విఆర్ఓ లాగిన్ తో సరుకులు ఇవ్వాలని వత్తిడి తెస్తున్నారు.  ప్రస్తుతం తమకు లాగిన్ సౌకర్యం లేదని, తమను దొంగలుగా చిత్రీకరించి ఎండియు వాహనదారులకు ఈ-పాస్ నిర్వహించే అధికారం ఇచ్చినందున ఇప్పుడు తాము రేషన్ పంపిణీ చేయలేమని డీలర్లు చెబుతున్నారు.

కరోనా తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 52మంది డీలర్లు చనిపోయారు. విఆర్ఒ లాగిన్ తో తమను సరుకులు పంపిణీ చేయాలని అంటున్నారని, ఏదైనా సమస్యవస్తే డీలర్లపై నిందమోపే అవకాశం ఉందని అంటున్నారు. వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందించలేదు. 
రెండోదశ కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్దంగా ప్రజలు పెద్దఎత్తున రేషన్ డిపోలవద్దకు సమూహాలుగా చేరడం వల్ల తాము కరోనా బారినపడే ప్రమాదమందని డీలర్లు ఆందోళన చెందుతున్నారు.

ఈనెల 10వతేదీలోగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి బీమాసౌకర్యంతోపాటు మాస్క్, శానిటైజర్, గ్లౌవ్స్, టీకా అందజేస్తే గతంలో తెలంగాణాలో ఇచ్చిన మాదిరి రెండువిడతల రేషన్ ఒకేసారి మాత్రమే ఇవ్వగలమని  అంటున్నారు.బలవంతంగా తమతో రేషన్ పంపిణీ చేయాలని చూస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు.
 
ప్రభుత్వ అనాలోచిత, అసమర్థ చర్యల కారణంగా రాష్ట్రంలో మొత్తం ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్థంగా, గందరగోళంగా తయారైంది. మేనెలలో 10శాతం రేషన్ కూడా ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. డోర్ డెలివరీ వాహనదారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి తక్షణమే రేషన్ పంపిణీకి చర్యలు చేపట్టండి. కరోనా సమయంలో పనుల్లేక పస్తులుంటున్న నిరుపేద ప్రజానీకానికి రేషన్ అందించడం ప్రభుత్వ తక్షణ కర్తవ్యం. రేషన్ వాహనదారులు, డీలర్ల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ సరుకుల కోసం ఎదురుచూస్తున్న 1.47కోట్లమంది పేదలను ఆకలి బారిన పడకుండా చూడాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాము.