గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: మంగళవారం, 4 మే 2021 (18:47 IST)

రాష్ట్రం శవాలదిబ్బగా మారకముందే, ముఖ్యమంత్రి మొద్దునిద్ర వీడాలి: సయ్యద్ రఫీ

రాష్ట్రంలో కరోనావిలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రజలు తమ కనీస అవసరాల కోసం కూడా బయటకు రావడానికి భయపడుతుంటే ప్రభుత్వం డీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించిందని టీడీపీ అధికారప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. మంగళవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

డీఈడీ పరీక్షలు కూడా ప్రభుత్వం వాయిదా వేస్తుందని భావించారని, 3వతేదీన పరీక్ష ఉండటంతో అభ్యర్థులందరూ దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ పరీక్షలకు హాజరయ్యారన్నారు. హైకోర్టు పరీక్షలన్నీ వాయిదా వేయమంటుంటే, నారా లోకేశ్ పరీక్షలు వాయిదావేయమన్నాడన్న మంకుపట్టుదలతో ముఖ్యమంత్రి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపాడన్నారు.

కోర్టు చీవాట్లు పెడుతుందని భావించి, అప్పటికప్పుడు ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిందన్నారు. ఇంటర్ పరీక్షలు వాయిదా వేయమని కోర్టు చెబుతుందని భావించి,  వాటిని మాత్రమే వాయిదా వేసిన ప్రభుత్వం, మిగిలిన పరీక్షల నిర్వహణకు సమాయత్తం కావడం ఏమిటని రఫీ ప్రశ్నించారు. డీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగిన విషయం ప్రభుత్వానికి తెలుసునా అని ఆయన ప్రశ్నించారు.

విద్యాశాఖమంత్రిగానీ, ముఖ్యమంత్రి గానీ ప్రస్తుతం ఏఏ పరీక్షలునిర్వహించాల్సి ఉంది, వేటిని వాయిదా వేయాలనే దానిపై ఏరోజైనా సమీక్ష నిర్వహించారా అని టీడీపీ నేత నిలదీశారు. పోటీపరీక్షలు సహా, వివిధ పరీక్షలకు హాజరవ్వాల్సిన అభ్యర్థులందరూ తమపార్టీకార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారని, పరీక్షలు వాయిదా పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వారు కోరుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి వెంటనే స్పందించి అన్నిరకాల పరీక్షలను వాయిదా వేయాలని రఫీ విజ్ఞప్తి చేశారు. రేపట్నుంచి మధ్యాహ్నం 12 గంటలకే అన్నీ మూసేయాలని ప్రభుత్వంచెబుతోందని, పరిస్థితి చేయిదాటి పోతుందని తెలిసికూడా ముఖ్యమంత్రి పదోతరగతిసహా, వివిధ రకాల పోటీపరీక్షలనిర్వహణకు మొగ్గుచూపడం ఎంతమాత్రం మంచిదికాదని రఫీ హితవుపలికారు.

రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సరైన వైద్యం అందడం లేదని, ఎక్కడాకూడా ఆక్సిజన్ కానీ, పడకలు కానీ, మందులు ఇంజక్షన్లు గానీ లభించడంలేదన్నారు. నిన్నటికి నిన్న విజయవాడలోనే దాదాపు 150వరకు శవాలను గుర్తించడం జరిగిందన్నారు. డీఈడీ పరీక్షలు రాసే అభ్యర్థుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అన్నారు. సుప్రీంకోర్టు, ప్రధానమంత్రి కూడా లాక్ డౌన్ ప్రకటించాలని, పరీక్షలు వాయిదా వేయాలని చెప్పినాకూడా ఈ ప్రభుత్వం అడ్డగోలుగా ముందుకుపోవడం ఎంతమాత్రం మంచిదికాదన్నారు.

ప్రభుత్వంగానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజల గురించి ఆలోచించడంలేదని, న్యాయస్థానాలు చెప్పేదాకా మొద్దునిద్ర వీడటం లేదన్నారు. భారత్ నుంచి ప్రయాణికుల రాకపోకలను వివిధదేశాలు నిషేధించాయని, దేశానికి ఇటువంటి పరిస్థితి రావడం నిజంగా బాధాకరమ న్నారు. జగన్మోహన్ రెడ్డి వ్యాక్సిన్లకోసం ప్రజలంతా ఎదురుచూడాల్సిన దుస్థితి కల్పించారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్నవారందరికీ ఎప్పుడు వ్యాక్సిన్లు అందిస్తారనేది జవాబులేని ప్రశ్నగానే మిగిలిందన్నారు. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి, తక్షణమే డీఈడీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని రఫీ డిమాండ్ చేశారు. తాడేపల్లిలో కూర్చొని తనప్రాణాలను జాగ్రత్తగా కాపాడుకుంటున్న ముఖ్యమంత్రి, విద్యార్థులు,ఇతరత్రా పోటీపరీక్షలురాసే అభ్యర్థుల జీవితాలతో ఎందుకు చెలగాట మాడుతున్నాడన్నారు.

కంటిచూపుతో కూడా కరోనా వ్యాపిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయని, అలాంటప్పుడు పరీక్షలునిర్వహిస్తే కరోనావ్యాప్తి ఎంత వేగంగా ఉంటుందో ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తనకుతానుగా తెలుసుకోవడంలేదని, ఏదైనా చెబితేనేమో తెలుగుదేశంపార్టీ చెప్పింది కాబట్టి చేయనంటున్నాడని రఫీ ఎద్దేవాచేశారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నాక, ముఖ్యమంత్రి  పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపాలన్నారు.

పదోతరగతిసహా, వివిధకోర్సుల పాఠాలే సరిగా బోధించలేదని, అటువంటప్పుడు పరీక్షలు నిర్వహించినా విద్యార్థుల వాటిని ఎలా రాయగలరో  ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రికి చెప్పలేకపోతున్నాడని, ఆయన ధైర్యం చేయకపోతే, విద్యార్థులప్రాణాలకు ఎవరు బాధ్యతవహిస్తారని రఫీ ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండిఉంటే, మంత్రులు అధికారులు ఇలా ఎవరికితోచినట్లు వారు వ్యవహరించేవారుకాదన్నారు.

విద్యార్థులకు ఏదైనా జరిగితే, గుడ్డిగా పరీక్షలు నిర్వహిస్తామంటున్న ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అందుకు బాధ్యత వహిస్తారా అని రఫీ నిగ్గదీశారు. తెలుగుదేశం నాయకులపై కక్షతో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి, పరిస్థితి గమనించి, వాస్తవాలను గమనించి మసలుకుంటే మంచిదన్నారు. ఈప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని తెలుగుదేశం ప్రతినిధిగా తాను డిమాండ్ చేయడంలేదని, మానవత్వంతో ఆలోచించి పరీక్షలువాయిదా వేయాలని విజ్ఞప్తిచేస్తున్నానని రఫీ వేడుకున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపుసురేశ్ రాష్ట్రంలో నిర్వహించాల్సిన వివిధరకాల పరీక్షలపై తక్షణమే సమీక్ష చేసి, అన్నింటినీ వాయిదా వేసేలా ముఖ్యమంత్రికి అర్థమయ్యేలా వివరించాలన్నారు.

18 నుంచి 45ఏళ్ల మధ్యఉన్నవారికి వ్యాక్సినేషన్ ఇప్పుడు చేపట్టలేమని చెప్పిన ముఖ్యమంత్రి, వ్యాక్సిన్లకొనుగోలుకు ఎటువంటి చర్యలు తీసుకున్నాడో స్పష్టంచేయాలన్నారు. గ్రామాల్లో బియ్యం సరఫరాచేసే వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో, నేటికీ చాలాచోట్ల పేదలకు బియ్యం పంపిణీ జరగలేదన్నారు. కేంద్రప్రభుత్వం అన్నిరకాల రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీచేయాలని చెబితే, రాష్ట్రప్రభుత్వం పూర్తిగా దానికి ఎగనామం పెట్టిందన్నారు.  

కరోనా ఉధృతిదృష్ట్యా లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి అన్నిదుకాణాలతోపాటు, మద్యం దుకాణాలనుకూడా మూసేయిస్తే మంచిదని రఫీ సూచించారు. మద్యం దుకాణాలు బంద్ చేస్తే, చాలావరకు ముఖ్యమంత్రి అనుకున్న లాక్ డౌన్ సంపూర్ణంగా అమలవుతుందన్నారు. ప్రభుత్వశాఖలన్నింటికీ సెలవులు ప్రకటించాలని, అత్యవసరసేవలకోసం కొన్ని విభాగాలను, కొందరుఉద్యోగులను ఇంటినుంచి పనిచేసేందుకు అనుమతించాలన్నారు.

ముఖ్యమంత్రి ఇప్పుడు అన్నింటినీ ఆపేయాలని, ప్రభుత్వం దగ్గరున్న సొమ్ముని, తన ఆలోచనలను ప్రజల ప్రాణాలుకాపాడటానికే వినియోగించా లని రఫీ డిమాండ్ చేశారు. పిచ్చిపిచ్చిపథకాలపేరుతో రంగురంగుల ప్రకటనలతో ప్రజలను మోసగించడం మానేసి, ముఖ్యమంత్రి తనధ్యాస మొత్తాన్ని కరోనా నియంత్రణపైనే పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి తక్షణమే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రావాలని, రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా క్షేత్రస్థాయిలో పర్యటించిచర్యలు తీసుకోవాలన్నారు.

తమిళనాడు మాదిరే రాష్ట్రంలో ఉత్పత్తయ్యే ఆక్సిజన్ ని, ముందు ఏపీ ప్రజలకే ఉపయోగించేలా జగన్మోహన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. 18 నుంచి 45ఏళ్ల వయస్సువారికి  ఇవ్వడానికి అవసరమైన వ్యాక్సిన్లను తక్షణమే కొనుగోలుచేయాలని, అందుకు అవసరమైన రూ.1600కోట్లను వెంటనే విడుదలచేయాలన్నారు. ప్రతి ఇంటికీ, మాస్కులు, శానిటైజర్ పంపిణీపై ముఖ్యమంత్రి దృష్టిపెట్టాలన్నారు. కోర్టుకు భయపడి ఇంటర్ పరీక్షలు వాయిదా వేసిన ముఖ్యమంత్రి, తక్షణమే అన్నిరకాల పరీక్షలు వాయిదావేసి, ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే దృష్టిపెట్టాలని రఫీ డిమాండ్ చేశారు.