గులకరాయి దాడి కేసులో ఉచ్చు బిగించే ప్రయత్నాలు : బోండా ఉమ
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన గులకరాయి దాడి కేసులో తన చుట్టూ ఉచ్చు బిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ నేత, ఆ పార్టీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి బోండా ఉమ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు సానుభూతి కోసం వైకాపా నేతలు గులకరాయి డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. వారు ఆశించిన సానుభూతి లభించకపోవడంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ నేతల మెడకు చుట్టేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు.
వేముల దుర్గారావును తమ కార్యాలయంలో ఉండగా పట్టుకెళ్లామని, వేముల దుర్గారావు తమ పార్టీ ఆఫీసు వ్యవహారాలు చూస్తుంటారని వివరించారు. అన్యాయంగా ఇరికిస్తే జూన్ నాలుగో తేదీ తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. పైగా, ఈ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు.
"సీఎంపై రాయి దాడితో నాకు సంబంధం లేదు. కొందరు అధికారులు నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. సీబీఐ విచారణ జరిపించండి. నేను విచారణకు సహకరిస్తా. వేముల దుర్గారావును హింసించి నా పేరు చెప్పించాలని చూస్తున్నారు. అంతకుముందు వడ్డెరగూడెం పిల్లలను తీసుకెళ్లి హింసించారు. తమకు డబ్బు ఇవ్వకపోవడం వల్లే రాయి విసిరినట్టు అందులో ఒకరు అని" బొండా ఉమ చెప్పారు.
రాయి డ్రామాకు బీసీని బలి చేసేందుకు సిద్ధమయ్యారు... : పట్టాభి
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకు దళితుడిని బలిపశువును వైకాపా నేతలు చేశారనీ, ఇపుడు గులకరాయి దాడిలో మరో బీసీని బలి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రా సమయంలో ఓ యువకుడు గులకరాయితో దాడి చేశారు. ఈ కేసులో దాడి చేసిన నిందితుడితో పాటు మరో నలుగురుని అదుపులోకి తీసుకున్నారు.
అయితే, ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర రావును ఇరికించేందుకు వైకాపా నేతలు కుట్రలు పన్నుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.పట్టాభిరామ్ బుధవారం స్పందించారు. గత 2019 ఎన్నికల్లో కోడికత్తి డ్రామాకి ఒక దళితుడిని బలి చేశారని, ఇపుడు ఒక బీసీని బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"బలహీన వర్గాలకు చెందిన పిల్లలను మీ కార్యాలయాల్లో బంధించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? బీసీలంటే మీకు అంత చులకనగా ఉందా? రాష్ట్రంలో ఉన్న కోట్లాడి మంది బీసీలు ఇపుడు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటి వారిపై ఈ రకమైన దౌర్జన్యం జరుగుతుంటే టీడీపీ చూసతూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా దీని పర్యావసానాలు అనుభవిస్తారు" అంటూ ఆయన హెచ్చరించారు.