నవ్యాంధ్ర రాజధాని పై మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు
నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా విశాఖపట్టణంను ఎంపికచేయడం ఖాయమని, నవ్యాంధ్ర రాజధాని మాత్రం విశాఖపట్టణమేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ, విశాఖపట్టణంకు రాజధాని రావడం తథ్యమని చెప్పారు. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దన్నారు.
మూడు రాజధానులు అనేవి తమ పార్టీ విధాన నిర్ణయమన్నారు. ఎవరెన్ని చెప్పినా ఏపీకి మాత్రం మూడు రాజధానులు ఉంటాయన్నారు. గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులోని లోపాలను సవరించి కొత్త బిల్లును త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెడుతామన్నారు. అలాగే, విభజన చట్టంలోనే ప్రత్యేక హోదా అంశం ఉందని ఆయన గుర్తుచేశారు. దీన్ని పొందేందుకు తమ ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు.