శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2019 (14:42 IST)

శ్రీవారి వస్తువులపై విజయసాయి కన్నుపడింది : బుద్ధా వెంకన్న

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి కాస్త జైలుసాయి రెడ్డిగా మారిపోయారంటూ సెటైర్లు వేశారు. పైగా, శ్రీవారి వస్తువులపై జైలుసాయిరెడ్డి కన్నుపడిందని ఆరోపించారు. విజయసాయి తప్పుడు సలహాల వల్లే వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి జైలుపాలయ్యారని వ్యాఖ్యానించారు. 
 
ఆయన ఆదివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ, జైలుసాయిరెడ్డి సూచనలు, సలహాలతోనే వైఎస్ జగన్ జైలుపాలు అయ్యారంటూ సెటైర్లు వేశారు. సాయిరెడ్డికి రోజూ చంద్రబాబు దండకం చదవనిదే నిద్రపట్టదన్న వెంకన్న... మే 23వ తేదీ తర్వాత వైసీపీ మట్టి కరచిపోతోందని జోస్యం చెప్పారు. 
 
వైఎస్.జగన్‌కు శకునిలా విజయసాయిరెడ్డి దాపరించారన్న టీడీపీ ఎమ్మెల్సీ... సాయిరెడ్డి, టీడీపీ బంగారు ఆభరణాలు దొంగిలించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. టీడీపీ ఆభరణాలు చేజారిపోవడంతో విజయసాయి గగ్గోలు పెడుతున్నారన్నారు.
 
వచ్చే నెల 23వ తేదీ తర్వాత మోడీ వ్యవహారాలపై విచారణ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత జగన్, సాయిరెడ్డి చంచల్‌గూడ్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఇక సీఎస్.. బీజేపీ దర్శకత్వంలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. జగన్ అవినీతి కేసులో ప్రస్తుత సీఎస్ ముద్దాయి అని గుర్తుచేశారు. 
 
విజయసాయిరెడ్డి నీచాతి నీచమైన వ్యక్తి అని బుద్ధా వెంకన్న విమర్శించారు. సీఏగా విజయసాయిరెడ్డిని ఇన్‌స్టిట్యూట్‌ నుంచి తొలగించారని అన్నారు. జైలు జీవితంలో సహకరించాడని విజయసాయిరెడ్డికి జగన్‌ రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని ముంచుతారని, విజయసాయిరెడ్డి కాదు.. జైలుసాయిరెడ్డిగా మారిపోయారని బుద్ధా వెంకన్న అభివర్ణించారు.