శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్

వైకాపాకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు : కేంద్ర మంత్రి చౌహాన్

devusinh
ఏపీలోని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్నారు. సుపరిపాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఫలితంగా అతి తక్కువకాలంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదారణ పూర్తిగా కోల్పోయిందన్నారు. దీంతో విపక్ష పార్టీలను అణిచివేసేందుకు వలంటీర్లను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకు ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. 
 
ఆయన మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలేదన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రణాళికా సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్రం ఇతర మార్గంలో వినియోగిస్తుందని ఆరోపించారు. దీనిపై గ్రామాల సంర్పంచ్‌లు వినతి పత్రాలు ఇచ్చారని చెప్పారు. ఇది గ్రామస్వరాజ్యంపై జగన్ సర్కారు చేసే దాడిగా ఆయన అభివర్ణించారు. 
 
రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లు, జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారికి జీతాలు ఇవ్వని ప్రభుత్వం వలంటీర్లకు మాత్రం జీతాలు ఇస్తుందని విమర్శించారు. వలంటీర్లు ప్రభుత్వ నిధులను పంచుతున్నారని, ఇతర పార్టీలను అణిచివేసేందుకు వారిని వాడుకుంటున్నారని, ఇపుడు జీవో నెం 1ను తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.