సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 3 జనవరి 2023 (20:05 IST)

ముందస్తు అంటే.. ఒక యేడాది ముందుగా ఇంటికెళ్లడం ఖాయం : వైకాపా ఎమ్మల్యే ఆనం

anam ramanarayana reddy
ముందస్తు ఎన్నికలంటూ పాట పాడుతున్నారని, అదే జరిగితే తనతో సహా వైకాపా పాలకులు ఒక యేడాది కంటే ముందుగానే ఇంటికి వెళ్ళడం ఖాయమని వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజలు వైకాపాకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు పూర్తికావొస్తోందని, ఇప్పటికీ సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వెంకటగిరి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి మరోమారు తనలోని అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అదే నిజమైతే యేడాది ముందే ఇంటికెళ్లడం ఖాయమని అన్నారు. 
 
ఒక్కటంటే ఒక్క సచివాలయ నిర్మాణం పూర్తికాలేదన్నారు. సాంకేతిక కారణాలా, బిల్లుల చెల్లింపు జాప్యమా తెలియడం లేదు. కాంట్రాక్టర్లకు ఎందుకు ముందుకు రావడం లేదో అర్థంకావడం లేదని వ్యాఖ్యానించారు. అధికారులను అడిగితే త్వరలో పూర్తి చేస్తామంటున్నారని, కానీ అవి పూర్తయ్యేలోపు తమ పదవీకాలం పూర్తవుందని అన్నారు. సచివాలయ సిబ్బంది కార్యాలయ లేకపోతే ఎక్కడ కూర్చొని పని చేయాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆనం విమర్శించారు. 
 
ఇదిలావుంటే, వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఆనం రామనారాయణ రెడ్డి స్థానంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కూడా ఆనం మండిపడ్డారు. ఎవరిని నియమిస్తుందో అధిష్టానాన్ని అడగాలని కోరారు.