బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

టీడీపీ కార్యకర్త అంత్యక్రియల్లో పాడెమోసిన చంద్రబాబు

గుంటూరు జిల్లా మాచర్ల నియోజవర్గంలోని గుండ్లపాడులో వైకాపా గూండాల చేతిలో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య అంత్యక్రియల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా పాడెమోశారు. ఆ తర్వాత గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "జగన్ రెడ్డీ.. నీ చెంచాలతో మాట్లాడించడం కాదు.. ధైర్యం ఉంటే రా.. బాబాయిని గొడ్డలితో చంపి గుండెపోటు అని చెప్పడం కాదు. మీరు చేసే పనులే మీ కార్యకర్తలు చేస్తున్నారు" అంటూ మండిపడ్డారు. 
 
"రాష్ట్రంలో తెలుగు పార్టీ 22 యేళ్లపాటు పరిపాలన చేసింది. కానీ, ఎన్నడూ కూడా మీలా హత్యా రాజకీయాలు ప్రోత్సహించలేదు. మీరు చేసిన హత్యలకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుంది ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. 
 
"వైకాపా అధికారంలో వచ్చిన తర్వాత 33 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకోండి. మీ గుండెల్లో నిద్రపోతా. టీడీపీ కుటుంబం జోలికి వస్తే వదిలేది లేదు" అని చంద్రబాబు హెచ్చరించారు.