శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:24 IST)

ఇక బీజేపీతో కష్టమే... ప్రత్యామ్నాయం చూసుకుందాం : ఎంపీలతో చంద్రబాబు

భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిగిపోయినట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, విత్తమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమ

భారతీయ జనతా పార్టీ నేతలు అనుసరిస్తున్న వైఖరితో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విసిగిపోయినట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా, ప్రధాని నరేంద్ర మోడీ, విత్తమంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు ఆడుతున్న దొంగాటతో చంద్రబాబు నొచ్చుకున్నారు. అందుకే ఆయనకు ఎన్నడూ లేని ఆగ్రహం వచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఇకపై బీజేపీ కలిసి సాగడం కష్టం.. ప్రత్యామ్నాయం చూసుకుందాం అంటూ సొంత పార్టీకి చెందిన ఎంపీలతో వ్యాఖ్యానించినట్టు టీడీపీ వర్గాల సమాచారం. 
 
అదేసమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ లోక్‌సభలో గురువారం చేసిన ప్రకటనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా, 'ఇక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. మన పోరాటం కొనసాగుతుంది. ఆపేది లేదు' అని తేల్చిచెప్పారు. 'మనం 19 ప్రధాన డిమాండ్లు అడిగితే వాటిపై అంశాలవారీగా సమాధానం ఇస్తారనుకుంటే జైట్లీ ఎప్పటిలాగే జవాబిచ్చారు. అందులో కొత్తదనం ఏముంది? మీరు నిరసన తీవ్రతరం చేయండి.. ఏమాత్రం రాజీపడొద్దు' అని తేల్చి చెప్పారు. 
 
అలాగే, బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ దాన్ని కొనసాగిస్తామని.. ఈలోపు కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుని అమలు చేస్తుందని ఆశిస్తున్నామని.. లేనిపక్షంలో ప్రత్యామ్నాయాలు చూసుకోక తప్పని పరిస్థితి వస్తుందన్నారు. 'బీజేపీపై రాజకీయ వ్యతిరేకతతో మేమీ పోరాటం చేయడంలేదు. రాష్ట్రానికి రావలసిన వాటి కోసం పోరాటం మొదలుపెట్టాం. ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. అన్నీ చేస్తే ఇబ్బంది లేదు. లేకపోతే మనదారి మనం చూసుకోక తప్పదన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు.