శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 30 మే 2018 (22:12 IST)

98 చేసి 2 పనులు చేయకపోయినా అదే ప్రజల్లోకి వెళ్తుంది... చంద్రబాబు

‘‘వంద పనులకు 98 పనులు చేసినా, 2 పనులు చేయకపోతే ఆ రెండు పనులు చేయలేదనేదే ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ, ఆ రెండు పనులు కూడా పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలి. చేయలేకపోతే ఎందుకు చేయలేక పోయామో వివరించాలి. ప్రభుత్వ సంక్

‘‘వంద పనులకు 98 పనులు చేసినా, 2 పనులు చేయకపోతే ఆ రెండు పనులు చేయలేదనేదే ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ, ఆ రెండు పనులు కూడా పూర్తయ్యేలా శ్రద్ధ వహించాలి. చేయలేకపోతే ఎందుకు చేయలేక పోయామో వివరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం తనను కలవడానికి వచ్చిన కుప్పం ప్రజలతో గ్రీవెన్స్ సెల్‌లో భేటి అయ్యారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘కుప్పం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనపై పూర్తి దృష్టిపెట్టి పూర్తిచేశాం. మిగిలినవి కూడా ఈ డిసెంబర్ నాటికల్లా పూర్తిచేస్తాం. ప్రజల్లో సంతృప్తి మరింత పెరుగుతుంది. ఇంకా నాలుగైదు వేల ఇళ్లు నిర్మించాల్సి వుంది. అవికూడా పూర్తయితే కుప్పంలో అందరికీ ఇళ్లు ఏర్పడినట్లే. త్వరలోనే అవికూడా పూర్తయ్యేలా చూస్తాం. హంద్రీ-నీవా ప్రాజెక్టు ఏడాదిలో పూర్తిచేస్తాం, కుప్పంకు సాగునీరు, తాగునీరు అందిస్తాం.
 
కుప్పం ప్రజలు నన్ను మాత్రమే గెలిపించడం కాదు, భారీ ఆధిక్యతనిచ్చి చిత్తూరు ఎంపి స్థానాన్నే తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తున్నారు. 30 ఏళ్లుగా వరుసగా గెలిపిస్తున్న కుప్పం ఓటర్ల రుణం తీర్చుకోలేనిది. పెట్టుబడులు ఆకర్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్‌గా ఉంది. సమ్మిట్‌లో చేసుకున్న 2500 ఎంవోయూల ద్వారా రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు, 35 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఉపాధి అవకాశాలు పెంచుతున్నాం. 
 
నిరుద్యోగ భృతి కూడా త్వరలోనే ఇస్తున్నాం. ముస్లింలకు రూ.1100 కోట్ల బడ్జెట్ పెట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. దుల్హన్ పథకం, ఇమాంలు, మౌజన్‌లకు జీతాలు, హజ్ భవన్‌ల నిర్మాణం, స్వయం ఉపాధికి చేయూత ఇస్తున్నాం. ముస్లింలు, క్రిస్టియన్ల సంక్షేమం కోసం ఇంత పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయడం ఇదే ప్రథమం. రజకులు, నాయీ బ్రాహ్మణులు, ఇతర చేతి వృత్తులవారికి 75 యూనిట్ల వరకు ఉచిత కరెంటు నిన్ననే ప్రకటించాం.
 
మన స్వయంకృషితోనే ఈ స్థాయిలో అభివృద్ధి, సంక్షేమం సాధించాం. దీనికి కేంద్రం సహకారం తోడైతే మరింత అభివృద్ధి, సంక్షేమం సాధించేవాళ్లం. 2019లో తెలుగుదేశం పార్టీ గెలుపు చారిత్రక అవసరం. నాలుగేళ్లలోనే మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివి కూడా 38 చేశాం. ఇవన్నీ చేశాం కాబట్టే రాబోయే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో ప్రజాదరణ పొందాలి’’ అని పేర్కొన్నారు.
 
ఈ సమావేశంలో నాలుగు మండలాల జడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యులు, ఎమ్మెల్సీ గౌరివాని శ్రీనివాసులు, మార్కెట్ యార్డు ఛైర్మన్ చంద్రశేఖర్, డిసిఎంఎస్ ఛైర్మన్ శ్యామ్ రాజు, మునిరత్నం, మనోహర్, జి.ఎం.రాజు,చౌడప్ప, ఆంజనేయ రెడ్డి, మునిస్వామి, సాంబశివం తదితరులు పాల్గొన్నారు.