శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 మార్చి 2021 (11:54 IST)

కేసీఆర్ చెప్పిన మాటల అక్షర సత్యం అంటున్న చంద్రబాబు నాయుడు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య ప్రస్తుతం తీవ్ర విభేదాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత  అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట సఖ్యతగానే ఉన్నారు.

అయితే ఓటుకు నోటు కేసుతో సీన్ మారిపోయింది. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్‌కు మద్దతుగా మాట్లాడారు కేసీఆర్. చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు పిలుపిచ్చారు.
 
అయితే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు.. కేసీఆర్‌ను సమర్ధిస్తూ మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భార వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సమర్ధించారు.

బడ్డెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. జగన్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గతంలో కంటే అంతా రివర్స్‌గా ఉందన్నారు. గతంలో ఏపీలో ఎకరం భూమి అమ్మి.. తెలంగాణలో రెండు ఎకరాలు కొనేవారని... ఇప్పుడు సీన్ మారిపోయి తెలంగాణలో ఎకరం ల్యాండ్ అమ్ముకుని.. ఆంధ్రప్రదేశ్‌లో రెండు ఎకరాలు కొనుక్కొంటున్నారని కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ చెప్పిన ఈ వ్యాఖ్యలే  అక్షరాలా నిజమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో రాష్ట్రాభివృద్ధి రివర్స్ గేర్‌లో పయనిస్తోందన్నారు. ఏపీలో ఎకరం అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనే పరిస్థితులు రివర్స్ అయ్యాయన్న కేసీఆర్ మాటలు అందరూ గ్రహించాలన్నారు చంద్రబాబు.
 
తెలుగుజాతి ఉద్ధరణ కోసమే ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించారని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని స్పష్టం చేశారు. రైతు సంక్షేమం కోసం ఎన్టీఆర్‌ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని చంద్రబాబు చెప్పారు.

పేదల పక్కా ఇళ్లకు 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన పార్టీ టీడీపీ అన్నారు. 9 నెలల్లో ప్రజాదరణ పొంది అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీదేనని తెలిపారు. 40 ఏళ్లలో 21 ఏళ్లు టీడీపీనే అధికారంలో ఉందన్నారు.