గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 16 నవంబరు 2021 (11:25 IST)

సైబర్ నేరాల నియంత్రణకు త‌ర‌చూ పాస్ వార్డ్ మార్చేయండి

ఆధునిక యుగంలో దొంగ‌త‌నం అంటే, అర్ధ‌మే మారిపోయింది. ఒక‌ప్పుడు ఇళ్ళ‌కు క‌న్నాలు వేసే, జేబులు కొట్టేసే దొంగ‌లుండేవారు... ఇపుడు నేరుగా నెట్ ద్వారా మ‌న బ్యాంకు ఖాతాల్లో సొమ్మును దోచే హైటెక్ ముఠాలు త‌యార‌య్యాయి. అందుకే సైబ‌ర్ నేరాల నియంత్ర‌ణ‌లో, అంద‌రికీ అవ‌గాహ‌నే ప్ర‌ధాన ఆయుధ‌మని పోలీసులు పేర్కొంటున్నారు.
 
 
విజయనగరం జిల్లాలో సైబరు నేరాలను నియంత్ర‌ణ‌కు, సైబరు నేరాల కేసుల మిస్టరీని చేధించేందుకు పోలీసు అధికారులు, సిబ్బందికి సైబరు భద్రతపై అవగాహన కల్పించేందుకు వర్క్ షాప్ జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ,  జిల్లా పోలీసుశాఖలో పని చేసే అధికారులు, సిబ్బందిని సైబరు నేరాల దర్యాప్తులో మెళుకువలు నేర్పేందుకు, ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు లెండీ ఇంజనీరింగు కళాశాల యాజమాన్యంతో జిల్లా పోలీసు శాఖ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, సైబరు నేరాలను నియంత్రించేందుకు, నమోదైన సైబరు కేసులను చేధించేందుకు లెండీ కళాశాల సైబరు నిపుణుల సహకారాన్ని తీసుకోనున్నామన్నారు. 
 
 
అదే విధంగా సైబరు నేరాలను దర్యాప్తు చేసే పోలీసు అధికారులు, సిబ్బందిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు కొద్ది రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక చేపడుతున్నామన్నారు. ఎంపిక చేసిన పోలీసు ఉద్యోగులకు ఈ శిక్షణ ఇచ్చి, వారిలో దర్యాప్తు మెళుకవలను పెంచుతామన్నారు. ఇందుకు సంబంధించి ఈ శిక్షణ కంప్యూటరు లేబ్ ను జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పోలీసుశాఖలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది యొక్క విద్యార్హతలను గుర్తించి, ఎంపిక చేసిన పోలీసు కానిస్టేబుళ్ళు, అధికారులకు ఈ -శిక్షణ ఇవ్వనున్నామన్నారు.


బెంగుళూరుకు చెందిన ప్రముఖ సైబరు నిపుణులు, మెంటరు, రచయిత్రి, పరిశోధకులు, గ్లోబల్ సలహాదారులైన శైలజా వడ్డమూడి సహకారంతో పోలీసు అధికారులుకు సైబరు నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు, నేరాలను చేధించేందుకు అవలంభించాల్సిన విధానాలు గురించి అవగాహన కల్పించేందుకు వర్క్ షాపును నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని శిక్షణ తరగతులను నిర్వహించి పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పిస్తామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.
 
 
సైబరు నిపుణులు శైలజ వడ్లమూడి మాట్లాడుతూ, ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంలను వినియోగించిన వారి సంఖ్య రోజు, రోజుకు పెరుగుతున్నాయని, వీటి వినియోగంతో ఏర్పడిన అంతరాలతో సైబరు నేరగాళ్ళు సరిక్రొత్త ఎత్తులతో మోసాలకు పాల్పడుతున్నారన్నారు. సైబరు నేరాలను నియంత్రించాలంటే ప్రజలంతా ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండడంతోపాటు, ఎప్పటికప్పుడు సరిక్రొత్త విధానాలతో భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. చాలామంది తమ విలువైన సమాచారాన్ని కంప్యూటర్లు, సెల్ ఫోన్లులో భద్రపర్చడం వలన సైబరు నేరగాళ్ళు అనేక మాల్వేర్ ను పంపి, మన డేటాను తస్కరించి, ఇతరులకు షేర్ చేయడం వలన మనకు పరిచయంలేని వ్యక్తులు, సంస్థల నుండి ఎస్ఎంఎస్ లు, కాల్స్ వ‌స్తున్నాయని, వారు అడిగిన ప్రశ్నలకు అవసరం లేకపోయినా సమాచారాన్ని అందించి, నేరాలకు పాల్పడేందుకు మనమే సహకారంను అందిస్తున్నామన్నారు. 
 
 
సైబరు నేరాలను నియంత్రించుటకు ఎప్పటికప్పుడు పాస్ వర్డ్స్ ను మార్చుకోవాలన్నారు. అదే విధంగా సైబరు నేరగాళ్ళ చేతుల్లో మోసపోయినపుడు ఎటువంటి సంకోచం, సందేహాలు పెట్టుకోకుండా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలన్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషనుల్లో మొబైల్స్ చార్జింగులకు ఏర్పాటు చేసిన యుఎస్ బి కేబుల్స్ వినియోగంతో చాలా మాల్వేర్స్ మొబైల్స్ లోకి వస్తున్నాయని, ఇటువంటి వాటిని వినియోగించడంపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబరు నేరాల్లో దర్యాప్తుకు ఉపయోగపడే కొన్ని సైబరు టూల్స్ గురించి వివరించి, వాటి వినియోగం గురించి పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

 
లెండీ ఇంజనీరింగు కళాశాల ప్రిన్సిపాల్ వైవి రామరెడ్డి మాట్లాడుతూ, సమాజానికి హాని కలిగించే సైబరునేరగాళ్ళు నియంత్రించేందుకు పోలీసులతో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని, తమవంతు సహకారాన్ని పోలీసుశాఖకు అందించేందుకు తమ కళాశాల యాజమాన్యం సిద్ధంగా ఉన్నారన్నారు. లెండీ ఇంజనీరింగు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా.హరిబాబు మాట్లాడుతూ - తమ కళాశాలలో ఇంగ్లీషు ల్యాబ్, సైబరు ల్యాబ్లు ఉన్నాయని, పోలీసు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారు వృత్తిలో రాణించేందుకు అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు.

 
ఈ వర్క్ షాపులో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, లెండీ కాలేజ్ ప్రిన్సిపాల్ వైవి
రామరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.హరిబాబు, సైబరు నిపుణులు శైలజ వడ్లమూడి, విజయనగరం డిఎస్పీ అనిల్ పులిపాటి, దిశ డిఎస్పీ టి.త్రినాధ్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, పలువురు సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.