మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (12:32 IST)

స్టాలిన్‌కు చంద్రబాబు లేఖ.. పాలిష్ చేసి అలా అమ్మేస్తున్నారు..

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్‌కు లేఖ రాశారు. తమిళనాడు పీడీఎస్ బియ్యాన్ని ఏపీ రైస్ మాఫియా తరలిస్తోందంటూ లేఖ ద్వారా తెలిపారు చంద్రబాబు. ఏయే రూట్లలో రేషన్‌ రైస్‌ మాఫియా అక్రమంగా రైస్‌ను తరలిస్తోందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగ్లర్ల ఫొటోలను స్టాలిన్‌కు రాసిన లేఖకు జత చేసి పంపారు.
 
తమిళనాడు పేదలకు చెందాల్సిన పీడీఎస్ బియ్యాన్ని ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల మీదుగా ఏపీకి తరలిస్తున్నారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దుల్లోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో నిఘా సరిగా లేకపోవడంతో రైస్ మాఫియా రెచ్చిపోతోంది.
 
అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని ఏపీలో రైస్ మిల్లర్లకు పంపుతున్నారు. రైస్ మిల్లర్లు బియ్యాన్ని పాలిష్ చేసి రైస్ మాఫియాకు పంపి బహిరంగ మార్కెట్‌లో ప్రజలకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు.  
 
తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 40కు అమ్ముతున్నారు. పీడీఎస్ రైస్ అక్రమ దందా భారీ స్థాయిలో జరుగుతోంది. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నిఘా పెంచండి అంటూ లేఖలో కోరారు.