బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (13:04 IST)

తెలంగాణాలో చుక్కలు తాకుతున్న చికెన్ ధరలు

తెలంగాణ రాష్ట్రంలో చికెన్ ధరలు చుక్కలు తాకుతున్నాయి. గతంలో వేసవి కాలంలో ఎన్నడూ చూడనంత స్థాయిలో చికెన్ ముక్క ధరలు పెరిగిపోయాయి. 
 
నిజానికి నెల రోజుల క్రితం వరకు వంద రూపాయలకు మూడు నుంచి నాలుగు కేజీల చికెన్ ఇచ్చారు. మరికొన్ని చోట్ల కేజీ చికెన్ కొనుగోలు చేస్తే అర కేజీ చికెన్ ఫ్రీ అంటూ బోర్డులు పెట్టారు. దీనికి కారణం బర్డ్ ఫ్లూ కారణంగా ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోవడమే. 
 
అయితే, ఈ వేసవిలో మాత్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా చికెన్ ధరలు పెరిగిపోయాయి. రెండు రోజుల క్రితం రూ.257కు చేరుకుని ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 
 
ఈ ధర మరింత పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్‌ ధర రూ.290 పలుకుతుంది. ఆదివారం చికెన్ కొందామని మార్కెట్లోకి వచ్చిన ప్రజలు ధరల గురించి తెలుసుకుని విస్మయానికి గురవుతున్నారు. వేసవిలో ఈ స్థాయిలో రేట్లు పెరగడం ఇదే తొలిసారని చికెన్ వ్యాపారులు తెలిపారు.
 
అంతేకాదు, రాబోయే రోజుల్లో చికెన్ ధర‌ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కరోనా నేపథ్యంలో వచ్చిన వదంతుల కారణంగా కొన్ని రోజుల క్రితం వరకు కోడి మాంసం ముట్టేందుకు బెదిరిపోయిన ప్రజలు ఇప్పుడు భారీగా ఎగబడుతున్నారు. 
 
కరోనా భయంతో నెల రోజుల క్రితం ఎన్నడూ లేనంతగా తగ్గిన చికెన్ ధరలు ప్రస్తుతం మండిపోతున్నాయి. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన సామాన్య ప్రజలు పెరిగిన ధరలతో చికెన్‌ ముక్కలకు దూరమవుతున్నారు.