ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా అయ్యన్న పాత్రుడు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా సీహెచ్.అయ్యన్నపాత్రుడు పేరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు. ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి 24676 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్టీలో సీనియర్ నేతగా, మాజీ మంత్రిగా ఉన్న ఈ బీసీ నేతను గత వైకాపా ప్రభుత్వం అన్ని రకాలుగా వేధించింది. ముప్పతిప్పలు పెట్టింది. ఇపుడు ప్రభుత్వం మారడంతో అయ్యన్న పాత్రుడు స్పీకర్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేశారు. పైగా, ఈయన అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
1982లో పార్టీ ఆవిర్భావ సమయం నుంచీ టీడీపీలో ఉన్నారు. 1983, 85, 94, 99, 2004, 14, 24ల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996లో అనకాపల్లి నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో పనిచేశారు. ఇటీవలి మంత్రివర్గ ఏర్పాటులోనే ఆయనకు మంత్రి పదవి లభించడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు భావించాయి. కానీ సామాజిక సమీకరణల దృష్ట్యా అవకాశం దక్కలేదు. గత ఐదేళ్లలో అధికార వైసీపీ పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపైనా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
దీంతో ఆయనపై పలు అక్రమ కేసులు బనాయించారు. నిర్భయ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ఇరిగేషన్ భూమికి ఫోర్జరీ ధ్రువపత్రాలతో ఎన్.వో.సీ తీసుకున్నారన్న ఆరోపణలతో సీఐడీ పోలీసులు 2022 నవంబరు 2వ తేదీన అర్థరాత్రి దాటాక ఇంటి గోడలు దూకి మరీ ఆయనను, ఆయన కుమారుడిని అరెస్టు చేయడం తెలిసిందే. తాజా ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం అనంతరం ఏర్పాటైన మంత్రివర్గంలో చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. దరిమిలా స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు.