తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస రావు!!
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస రావును ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించారు. ఈ మేరకు ఆయన ఆదివారం అధికారికంగా ఉత్తర్వులు జారీచేశారు. పార్టీ విశాఖ పార్లమెంటు అధ్యక్షుడిగా సమర్థంగా పనిచేసిన పల్లా తన నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొ న్నారు.
అలాగే, రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటివరకు టీడీపీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడిని ఆయన అభినందించారు. పల్లా ఈ ఎన్నికల్లో 95,235 ఓట్ల భారీ మెజారిటీతో గాజువాక నుంచి గెలుపొందిన విషయం తెల్సిందే. రాష్ట్రంలో ఈయనదే అత్యధిక మెజారిటీ 2014లోనూ గెలిచిన ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ప్రయత్నించినప్పటికీ అనేక సమీకరణల కారణంగా వీలు కాలేదని, ఇప్పుడాయనపై చాలా పెద్ద బాధ్యత పెట్టామని బాబు చెప్పినట్లు తెలిసింది.
పల్లా కుటుంబం ఆది నుంచీ టీడీపీతోనే ఉంది. ఆయన తండ్రి సింహాచలం 1994లో విశాఖ-2 ఎమ్మెల్యేగా ఆ పార్టీ తరపున గెలిచారు. పల్లా విశాఖ పార్లమెంటు పార్టీ అధ్యక్షుడిగా 2000 నుంచి 2024 ఎన్నికల వరకు పనిచేశారు. తన నియామకంపై ఆయన స్పందిస్తూ, పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టిన చంద్రబాబుకు పల్లా ధన్యవాదాలు తెలియజేశారు. తనపై గురుతర బాధ్యతను ఉంచిన అధినేత నమ్మకాన్ని నిల బెడతానని.. ఆయన ఆశీస్సులతో పదవిని సమర్థంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతానని అన్నారు.
'పూర్తి సమయం పార్టీ కోసం కేటాయిస్తా, ఇంతటి బాధ్యత తీసుకోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. కార్యకర్త లకు అండగా ఉంటా. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ పని చేస్తా. నామినేటెడ్ పదవుల విషయంలో కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు అధిక ప్రాధాన్యం ఇస్తా' అని తెలిపారు.