సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 ఆగస్టు 2021 (13:44 IST)

ఏపీ పిటిషన్‌పై విచారణ అక్కర్లేదు.. మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోండి.. సుప్రీంకోర్టు

కృష్ణా జలాల పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న తెలుగు వ్యక్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 
 
ఈ విచారణ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది మాట్లాడుతూ… ఏపీ వేసిన పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసిందన్నారు. ఏపీ తరపు న్యాయవాది మాట్లాడుతూ… అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని… గెజిట్‌ను ఇప్పటి నుంచే అమలు చేయాలని, కొన్ని నెలల పాటు నీటిని నష్టపోకూడదనే తాము అడుగుతున్నామని అన్నారు.
 
ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ… జల వివాదం అంశాన్ని రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించారు. తాను ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని చెప్పారు. ఇక మధ్యవర్తిత్వానికి సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తామని… లేని పక్షంలో ఈ పిటిషన్‌ను వేర్ బెంచ్‌కు బదిలీ చేస్తామని చెప్పారు. 
 
ఇరువైపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ వివాదంలో తాము అనవసరంగా జోక్యం చేసుకోదలుచుకోలేదన్నారు. దీంతో, ఏపీ తరపున హాజరైన న్యాయవాది దుష్యంత్ దవే సమయం కావాలని కోరగా… తదుపరి విచారణను సుప్రీంకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు తెలంగాణ తరపున న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ కోర్టుకు హాజరయ్యారు.