1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (23:03 IST)

రాయలసీమలో ఏపీ సీఎం జగన్.. భారీ ప్రాజెక్టులకు శ్రీకారం

రాయలసీమలో ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 2021, జూలై 08వ తేదీ గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరిగే రైతు సభకు హాజరుకానున్నారు. ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. 
 
రాయదుర్గం మార్కెట్‌ యార్డ్‌లో అగ్రి ల్యాబ్‌ను ఆవిష్కరించనున్నారు. 15 వందల 6 కోట్ల అగ్రి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 413 కోట్లతో నిర్మించిన 18 వందల 98 ఆర్‌బీకేలు.. 80 కోట్లతో నిర్మించిన 100 అగ్రికల్చర్‌, ఆక్వా ల్యాబ్‌లు.. 53 వెటర్నరీ ఆస్పత్రులను సీఎం ప్రారంభించనున్నారు.
 
400 కోట్లతో నిర్మించనున్న 12 వందల 62 వ్యవసాయ గోదాంలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. రూ.200 కోట్లతో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ పనులను సీఎం ప్రారంభించనున్నారు. రాయదుర్గం నుంచి పులివెందులకు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు జగన్. 
 
ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్కిల్ ట్రైనింగ్ సెంటర్, త్రాగునీటి ప్రాజెక్టులు, రింగ్ రోడ్డు పనులతో పాటు మొత్తం 17 వందల 39 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇడుపులపాయలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులర్పించనున్నారు.
 
2021, జూలై 09వ తేదీన శుక్రవారం బద్వేల్‌లో 500 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్‌. 84 కోట్లతో ఎల్.ఎస్.పి డ్యామ్ కాలువల విస్తరణ, 54 కోట్లతో తెలుగుగంగ ప్రాజెక్టు పెండింగ్ పనులు, 36 కోట్లతో తాగునీటి లిఫ్ట్ పనులు, 20 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు