మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (08:55 IST)

మహిళలు పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఏపీ సీఎం జగన్

ఏదైనా సమస్యతో ఫిర్యాదులివ్వాలన్నా.. కేసులు పెట్టాలన్నా మహిళలు పోలీసుస్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఫిర్యాదులు చేయొచ్చునని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు.

దిశ యాప్‌లోని అన్ని ఫీచర్లపై మహిళా పోలీసులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రెండు వారాలకు ఒకసారి జిల్లా కలెక్టర్, ఎస్పీ సమావేశం కావాలని, ప్రజా సమస్యలతో పాటు మహిళా భద్రతపైనా సమీక్షించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపించాల్సి ఉంటుందని సూచించారు. 
 
పోలీసుస్టేషన్లలో రిసెప్షన్ వ్యవస్థలపైనా కూడా సమీక్షలు జరపాలని తెలిపారు. దిశ యాప్ పనితీరుపై ప్రతి ఠాణాలోనూ డిస్‌ప్లే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలపై నేరాల విచారణకు 18 ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
 
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై మరోమారు మాట్లాడాలని తెలిపారు. చిన్నారులపై నేరాలకు సంబంధించి 19 ప్రత్యేక న్యాయస్థానాలపై దృష్టి సారించాలని సూచించారు. డిజిగ్నేటెడ్ న్యాయస్థానాల్లో పూర్తి స్థాయి రెగ్యులర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
 
181 కాల్సెంటర్ ను దిశకు లింక్ చేయాలని సూచించారు. దిశ కాల్సెంటర్ను అదనపు సిబ్బందితో బలోపేతం చేయాలి. గస్తీ కోసం 145 స్కార్పియో వాహనాల కొనుగోలుకు ఆమోదం తెలుపుతున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు, వర్సిటీలు, ఇంజినీరింగ్ కాలేజీలతో పాటు ఇతర ముఖ్యమైన ప్రాంతాలున్న ఠాణాలకు ఇస్తామన్నారు. కొత్తగా ఆరు దిశ పోలీసుస్టేషన్ల నిర్మాణానికి ఆమోదం తెలుపుతున్నట్టు వెల్లడించారు. 
 
దీనికి వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. ఫోరెన్సిక్ ల్యాబరేటరీల్లో మరో 61 మందిని నియమించాలని ఆదేశించారు. తిరుపతి, విశాఖపట్నంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారు.
 
గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసేలా చూడాలన్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాల అమలుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. జీరో ఎఫ్ఐఆర్ అవకాశాన్ని కల్పించాలన్నారు.