తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద హై అలెర్ట్..
అమరావతి రైతుల దీక్షలకు ఆదివారంతో 550 రోజులు పూర్తయిన నేపథ్యంలో తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసం వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. నిరసనకారులు సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. సీఎం నివాసం పరిధిలో ఎవరైనా కొత్తవారికి ఆశ్రయం కల్పిస్తే చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేశారు.
సీఎం క్యాంపు కార్యాలయానికి దారితీసే మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి అమరావతి రైతులు ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కరోనా సమయంలోనూ రైతుల దీక్షలు కొనసాగాయి.
వైసిపి ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించిననాటి నుండి రాజధాని రైతులు, మహిళలు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి కోసం తమ వ్యవసాయ భూములను త్యాగం చేశామని... ఇప్పుడు రాజధానిని ఇక్కడి నుండి తరలిస్తామంటే ఒప్పుకునేదే లేదని దీక్ష చేపట్టారు.