గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 3 జులై 2021 (13:44 IST)

సీఎం జ‌గ‌న్ ఇంటి ప‌న్ను బిల్లులు క‌ట్టేశారోచ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాడేప‌ల్లి ఇంటికి సంబంధించిన ఆస్తి ప‌న్నులు రెండేళ్ళుగా బ‌కాయి ఉన్నాయ‌నే వార్త‌లు రాగానే, అంతే స్పీడుగా స్పంద‌న కూడా వ‌చ్చేసింది. సీఎం ఇంటి ప‌న్ను బ‌కాయిల‌ను వెంట‌నే చెల్లించేశారు. ఆ బిల్లుల తాలూకు న‌క‌లును కూడా రిలీజ్ చేశారు.

ప్రస్తుతం సీఎం జగన్ ఉంటున్న నివాసానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లించడంలేద‌ని, ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్ ఒక్కరూపాయి కూడా ఆస్తి పన్ను చెల్లించలేద‌ని వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన సొంత భవనంలో  జ‌గ‌న్ అధికారికంగా నివాసముంటున్నారు. దానినే క్యాంపు కార్యాలయంగా చేసుకొని అధికారిక సమావేశాలు కూడా ఇక్క‌డి నుంచే నిర్వ‌హిస్తున్నారు.

కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మాత్రమే జగన్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో ఉన్న రెండు బ్లాకుల్లో ఉన్న ఒకటి కార్యాలయం కాగా, మరొకటి ఆయ‌న నివాసం. ఆఫీసు 1750 చదరపు మీటర్ల పరిధిలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉన్నాయి. మునిసిపల్‌ రికార్డు ప్రకారం దీని చిరునామా.. డోర్‌ నంబరు 12-353/2/2 పార్సివిల్లే 47, ఆంధ్రరత్న కట్ట, రెవెన్యూ వార్డు నంబరు 12, తాడేపల్లి – 522501 అని ఉంది.

ఇదే ప్రాంగణంలో మొత్తం 219 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస భవనం కూడా ఉంది. దీని డోర్‌ నంబర్‌ 12-353/2/5. దీనిని జీ+2 గా నిర్మించారు. ఈ రెండు భవనాలు ముఖ్యమంత్రి సతీమణి వైఎస్ భారతి రెడ్డి పేరిట ఉన్నాయి. మునిసిపల్‌ శాఖ రికార్డుల ప్రకారం.. కార్యాలయం కోసం వినియగిస్తున్న భవనాన్ని కమర్షియల్ ప్రాపర్టీగా, ఇంటిని రెసిడెన్షియల్ ప్రాపర్టీగా చూపించారు.

వార్షిక రెంటల్‌ విలువను ఆఫీసుకు రూ. 13,64,131గా, ఇంటికి రూ.79,524 చూపించి ఆస్తి పన్ను నిర్ణయించారు. దీని ప్రకారం.. ఆఫీసుకు ఏటా రూ.4,41,980... ఇంటికి 19,752 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ‌కాయిలు ఒక్క రూపాయి కూడా చెల్లించ‌లేద‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీనిపై వెంట‌నే స్పందించి, ప‌న్నులు కట్టేశారు. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్, మంగ‌ళ‌గిరి చెక్కు ద్వారా 70,740 ఒక బిల్లు, 16 ల‌క్ష‌ల 19 వేల 649 రూపాయ‌ల చెక్కుతో మ‌రో బిల్లు కూడా క‌ట్టేశారు. ఇందులో రెండేళ్ల‌కు జ‌రిమానా వ‌డ్డీ కింద 2,93,7-9 రూపాయ‌లు క‌ట్ట‌డం విశేషం.