గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 1 జులై 2020 (20:11 IST)

గంటల వ్యవధిలోనే కళాకారుల పింఛను బకాయిలు విడుదల చేయించిన సిఎం జగన్

వృద్ధ కళాకారుల ఫించన్ల విషయంలో సమస్య తన దృష్టికి వచ్చిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే నిధుల విడుదలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ అన్నారు.
 
గత ఏడు నెలలుగా వృద్ధ కళాకారులకు అందవలసిన పింఛను మొత్తాలను విడుదల చేయలేదన్న విషయాన్ని తాను జూన్ 29వ తేదీన సిఎం దృష్టికి తీసుకురాగా, తక్షణమే స్పందించిన ఆయన అదే రోజు పూర్తి వివరాలను తెప్పించుకుని, ఒక రోజు కూడా ముగియకుండానే జూన్ 30న జిఓ విడుదల చేయించారని యార్లగడ్డ వివరించారు.
 
కళాకారులు పింఛన్లు అందక బాధపడుతున్నారన్న విషయాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారని, తక్షణమే అధికారులను పిలిపించి గంటల వ్యవధిలో సమస్యను పరిష్కరించారన్నారు. ఇకపై ఇతర పింఛన్ల మాదిరిగానే ప్రతి నెల ఒకటవ తేదీనే వీరికి కూడా పింఛను అందేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పటమే కాక, చేసి చూపించారని ఆచార్య యార్లగడ్డ ప్రస్తుతించారు.
 
2019 డిసెంబర్ నుండి ఈ సంవత్సరం మే వరకు ఆరు నెలల కాలానికి గాను రూ. 8,43,66,000లను విడుదల చేస్తూ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ జిఓ విడుదల చేసిందని, కళాకారులు అందరూ ముఖ్యమంత్రికి తమ ధన్యవాదాలు తెలుపుతున్నారని ఆచార్య లక్ష్మి ప్రసాద్ పేర్కొన్నారు.