గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 ఫిబ్రవరి 2022 (15:46 IST)

కేంద్రం చేస్తున్న మంచి పనులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం : సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న మంచి పనుల పట్ల ఎలాంటి సంకోచం లేకుండా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయగా, మరికొన్నింటికి కొత్తగా శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పాలుపంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, రహదారుల విస్తరణకు ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భూసేకరణతో పాటు అన్ని అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.10,600 కోట్లను కేటాయించినట్టు సీఎం తెలిపారు. 
 
అలాగే, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. నితిన్ గడ్కరీ సహకారంతోనే బెజవాడ బెంజి సర్కిల్ వంతెన వేగంగా పూర్తయిందని చెప్పారు. రాష్ట్రానికి మరికొన్ని రహదారులు అవసరమని, వాటికి కూడా ప్రతిపాదనలు పంపుతామని, అవి మంజూరు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం జగన్ సభా ముఖంగా వేడుకున్నారు.