మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (11:02 IST)

నేడు పోలవరానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి ఆయన పోలవరం పర్యటనకు వెళతారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అలాగే పునరావాస కాలనీ వాసులతో వారిద్దరూ మాట్లాడుతారు. ఈ మేరకు సీఎం జగన్ పోలవరం సందర్శనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 
 
కాగా, గురువారం రాత్రికి విజ‌య‌వాడ చేరుకున్న గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌కు జ‌గ‌న్ రాత్రి విందు ఇచ్చారు. ఆ త‌ర్వాత శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు - 1 పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో జ‌గ‌న్‌, షెకావ‌త్‌లు మాట్లాడతారు.
 
ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్‌ సైట్‌ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకుంటారు.