ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపైకి ఆంబోతును వదిలేశారు..
భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జీవీఎల్‌ను ఒక ఆంబోతులా సీఎం రమేష్ పేర్కొన్నారు.
ప్రస్తుతం సీఎం రమేష్ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెల్సిందే. అలాగే, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులతో పాటు... ఇతర టీడీపీ నేతలే లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు. ఈ సోదాలపై జీవీఎల్ స్పందించారు.
ఈ నేపథ్ంలో ఢిల్లీలో సీఎం రమేశ్ మాట్లాడుతూ ఉక్కు ఫ్యాక్టరీ విషయం ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటన చేయాలని, కానీ జీవీఎల్ ఏదోదో మాట్లాడుతున్నారని అన్నారు. ఆయనకు ఏ అంశంపైనా అవగాహన లేదని విమర్శించారు.
కానీ, ప్రతి అంశంపైనా మీడియా ముందు చర్చకు తాను సిద్ధమని, చర్చకు రావాలని రమేశ్ సవాల్ విసిరారు. అబద్ధాలు చెబితే ప్రజలు ఏమనుకుంటారోనన్న భావన లేకుండా ఆంబోతును వదిలేసినట్లుగా ఆయనను ఏపీ పైకి వదిలేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దీనిపై జీవీఎల్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు.. 'రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు. మీలాగే సవాల్ చేసి ఎంపీ సుజనా చౌదరి గతంలో తోకముడిచారు. మీరూ అంతేనా..? మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ.. పర్ఫార్మెన్స్ తక్కువ.. నేను చర్చకు సిద్ధం.. ఎప్పుడైనా ఎక్కడైనా.. మీరు సిద్ధమా..?' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.