గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (09:34 IST)

ఉండవల్లిలో మళ్ళీ పూర్తి లాక్ డౌన్..సచివాలయానికి వెళ్లే వాహనాల దారి మళ్లింపు

ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఉండవల్లిలో మళ్లీ పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించారు. కోవిడ్ -19 నియంత్రించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు అనుసరించి నుంచి లాక్ డౌన్ ప్రకటించారు. లాక్ డౌన్ పై తాడేపల్లి తహశీల్దార్ శ్రీనివాసులురెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ.. ఉండవల్లి గ్రామంలో ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు నిత్యావసర సరుకులు అమ్మకాలు నిర్వహించాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను స్ట్రీట్ వెండర్స్ కు అనుమతి ఇవ్వబోమని తేల్చిచెప్పారు. షాపు యజమానులు కూడా ఉదయం 9 గంటల తర్వాత షాపులు తెరిచి ఉంటే కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు.

నిత్యావసర సరుకుల కోసం వచ్చే వారు కుటుంబానికి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, మాస్కు ధరించాలని ఆయన అన్నారు. మాస్కులు ధరించి గడ్డం కిందకు పెట్టుకున్నా వాలంటీర్లు అపరాధ రుసుము విధిస్తారని ఆయన తెలిపారు. ఎవరైనా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినట్లు వాలంటీర్లు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయాలని పోలీసులకు తహశీల్దార్ ఆదేశాలు జారీచేశారు.

అలాగే నిత్యావసర సరుకులు కూడా గ్రామ సెక్రటరీ చెప్పిన రోజు మాత్రమే కొనుగోలు చేసుకోవాలని, అలా కాకుండా రోజూ కొనుగోలు కోసం విజయవాడ వెళ్లివస్తామని, గుంటూరు వెళ్లివస్తామని వెళితే అటువంటి షాపులను గుర్తించి సీజ్ చేస్తామని ఆయన అన్నారు.

లాక్ డౌన్ సమయంలో పంచాయతీ సిబ్బందిపై గాని, వాలంటీర్లపై గాని ఎటువంటి దౌర్జన్యాలు చేసినా సహించేది లేదని, అటువంటివారిపై చట్టప్రకారం చర్యలు తీసకుంటామని ఆయన తెలియచేశారు. ఈ సమావేశంలో తాడేపల్లి ఎంపిడిఓ రామప్రసన్న, తాడేపల్లి ఎస్సై భార్గవ్, ఉండవల్లి పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
 
సచివాలయానికి వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
ఉండవల్లిలో పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో వాహనాలు దారిమళ్లించే ఏర్పాట్లు చేసిన గుంటూరు ఉత్తర మండల డీఎస్పీ దుర్గాప్రసాద్ తెలిపారు. విజయవాడ నుంచి సచివాలయానికి హైకోర్టుకు వెళ్లే వాహనాలను ఉండవల్లి కూడలి నుంచి మంగళగిరి సమీపంలోని డాన్ బాస్కొ మీదగా వెళ్లేవిదంగా ఎర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు గమనించి పోలీసులకు సహరించాలని కోరారు.