శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 11 ఏప్రియల్ 2020 (08:46 IST)

ఏపీలో కొనసాగుతున్న కోవిడ్‌ నివారణ చర్యలు

రాష్ట్రంలో కొత్తగా గుంటూరు, తూర్పు గోదావరి, కర్నూలు, ప్రకాశం జిల్లాలలో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 381 కి చేరింది. 

కర్నూలు జిల్లాలో అత్యధికంగా 77 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 58, నెల్లూరు జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 35, వైయస్సార్‌ కడప జిల్లాలో 29, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాలలో 22, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలలో 20 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 15 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.

కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 10 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 4గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు.. తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 10 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. 

వివిధ ఆస్పత్రులలో 365 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయారు. అనంతపురం, కృష్ణా జిల్లాలలో ఇద్దరు చొప్పున, గుంటూరు, కర్నూలు జిల్లాలలో ఒక్కొకరు చనిపోయారు.

ఇంకా 13 జిల్లాలలో మొత్తం 133 ప్రాంతాలను రెడ్‌జోన్లుగా గుర్తించి, ఆయా చోట్ల రాకపోకలు నిషేధించడంతో పాటు, వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.
 
జిల్లాల వారీగా వివరాలు:
 
శ్రీకాకుళం జిల్లా:
కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం జిల్లా యంత్రాగం అన్ని చర్యలు చేపట్టింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు భౌతిక దూరం సరైన మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్ధ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు ప్రకటించడంతో రద్దీ ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల కొనుగోళు, అమ్మకాలు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే పరిమితం చేసింది.

మరోవైపు ప్రజలు ఇళ్ళ వద్దనే ఉండేలా చూస్తున్నారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా కూరగాయలు, పండ్లు, నిత్యావసరాలు డోర్‌ డెలివరీ చేస్తున్నారు. కలెక్టర్‌ జె నివాస్, జాయింట్‌ కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు ఆ మేరకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు.

శ్రీకాకుళం పట్టణంలో రైతు బజారును సువిశాల ప్రదేశాలైన ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాల, పి.ఎస్‌.ఎన్‌.ఎం పాఠశాల, ఎన్‌.టి.ఆర్‌.ఎం.హెచ్‌.పాఠశాల మైదానాలకు తరలించి ఒక దుకాణానికి మరొక దుకాణానికి మద్య దూరాన్ని పాటించడమే కాకుండా దుకాణాల ఎదురుగా వినియోగదారులు వరుస క్రమంలో నిలుచుని కూరగాయలు కొనుగోళుకు మార్కింగులను ఏర్పాటు చేసారు.

కూరగాయల కొరత లేకుండా అన్ని చర్యలు చేపట్టారు. ప్రతి రోజు మూడు నుండి మూడు వందల ఏభై క్వింటాళ్ళ కూరగాయలు అందుబాటులో ఉంటున్నాయి. 80 శాతం మేర జిల్లాలో లభ్యమయ్యే కూరగాయలు తెస్తున్నారు.
 
విజయనగరం జిల్లా:
కరోనా కట్టడిలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటివరకూ ఎక్కడా ఒక్క కరోనా కేసు నమోదు కాకపోవడంతో, జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. అయినప్పటికీ జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలతో, ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తూ, వ్యాధి నియంత్రణకు బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది.

దీనిలో భాగంగా  జిల్లా వ్యాప్తంగా చేపట్టిన మూడో విడత కోవిడ్‌–19 సర్వే తుది దశకు చేరుకుంది. హైరిస్క్‌ ఉన్న వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.

ఈ సర్వేలో భాగంగా గ్రామ స్థాయిలో వలంటీర్లు, ఆశ కార్యకర్తలతోనూ, మునిసిపాలిటీల్లో వార్డు వాలంటీర్లు, మెప్మా రిసోర్స్‌ పర్సన్‌లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు.  ఎక్కడైనా దగ్గు, జ్వరం, జలుబు, శ్వాస పీల్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం వంటి కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారి వివరాలను నమోదు చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రూపొందించిన ఒక ప్రత్యేక యాప్‌ను వినియోగించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.

ముఖ్యంగా హైరిస్క్‌ ఉన్న వారిని, ఇతర దేశాలు, ఇతర ప్రాంతాలు నుంచి వచ్చిన వారిని గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశం. ఇలా హైరిస్క్‌ ఉన్న వారిని గుర్తించి, వారి సమాచారాన్ని వైద్యాధికారితో కూడిన ద్వితీయ శ్రేణి సర్వైలెన్స్‌ టీమ్‌కు అందిస్తారు.

ఆయా బృందాలు వీరికి చికిత్సనందించడంతో పాటు, వారి ఆరోగ్యాన్ని నిరంతరం కనిపెట్టుకొని ఉంటారు. అవసరమైన వారి నమూనాలు తీసి, వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలకు పంపిస్తారు.  ఈ కార్యక్రమాన్ని మండల, మున్సిపాలిటీ స్థాయిల్లో ఎంపిడిఓ, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆరోగ్య బృందాలు పర్యవేక్షిస్తాయి.

జిల్లా వ్యాప్తంగా ఈనెల 8వ తేదీ  నుంచి ఈ సర్వే జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లోని 10,972 మంది వాలంటీర్లు, 2,588 మంది ఆశ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.  జిల్లాలో దాదాపు 6,99,218 ఇళ్లు ఉండగా, ఇప్పటి వరకు 6,29,800 ఇళ్ల నుంచి సమాచార సేకరణ పూర్తయ్యింది. 

65ఏళ్లు పైబడ్డవారు, 65 ఏళ్లు లోపు వారు, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసకోశ సమస్యలు.. అలాగే మధుమేహం, బిపి, కేన్సర్, హృద్రోగం తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు.. వివిధ కేటగిరీల్లో  హైరిస్క్‌ విభాగంలో సుమారుగా 2,140 మంది ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించారు.   
 
విశాఖపట్నం జిల్లా:
జిల్లాలోని  7 కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో నివసిస్తున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కె. కన్నబాబు తెలిపారు.  శుక్రవారం విశాఖలో పర్యటించిన ఆయన, వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి.విజయసాయిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.

కంటైన్మెంటు ఏరియా పరిధిలో  కేంద్ర ప్రభుత్వ  మార్గదర్శకాలు ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మంతి కన్నబాబు తెలిపారు. అందులో భాగంగానే ఆ ఏరియాలో రాకపోకలు నిషేధించారని చెప్పారు. అంతే కాకుండా ఆ ప్రాంతాలలో 2,06,362 కుటుంబాలకు  చెందిన 7,28,961 మంది ప్రజలు ఉన్నారని, వారందరికీ  అధికారులు మానసిక స్థైర్యం కలిగించాలని కోరారు.

అత్యవసర విధులు నిర్వర్తించే సిబ్బందికి, మీడియాకు సహకరించాలని పోలీసులకు సూచించారు.  ఆ ప్రాంతంలో నిత్యావసరాల లభ్యతపై చర్యలు చేపట్టేందుకు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహంచామన్నారు.  కంటైన్మెంట్‌ పరిధిలోని వారికి ఏ సమస్యలున్నా వెంటనే కంట్రోల్‌ రూమ్‌ను సంప్రదించాలని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 
జిల్లాలో ఇప్పటి వరకు 20 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో 4 గురు పూర్తిగా కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

విమ్స్‌ ఆసుపత్రిని కోవిడ్‌ రాష ్ట్రస్థాయి ఆసుపత్రిగా ఏర్పాటు చేయడమైనదని అందులో 148 క్రిటికల్, 500 నాన్‌ క్రిటికల్‌ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయన్నారు.  నగరంలో గీతం, ఎన్‌.ఆర్‌.ఐ., అపోలో, జి.వి.ఆర్, కేర్‌  ఆసుపత్రులలో 2158 బెడ్స్‌ అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం 151 మంది క్వారంటైన్లో ఉన్నారని, క్వారంటైన్‌ కొరకు 2000 సింగిల్‌ బెడ్‌ రూంలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కన్నబాబు వివరించారు.

వైయస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సుమారు  1.47 కోట్ల రేషన్‌కార్డుదారులకు నిత్యావసరాలు అందించటం జరుగుతుందని, దాదాపు 92 శాతం మంది సరుకులు ఇప్పటికే లబ్ధిదారులకు అందాయని చెప్పారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ  ఉండి పోయిన వారి కొరకు  జి.వి.ఎం.సి సిబ్బంది షెల్టర్లు ఏర్పాటు చేసి, పౌష్టికాహారం అందిస్తున్నారని తెలిపారు.   రేషను కార్డు లేనివారు  ఆయా షెల్టర్లకు వచ్చి ఆశ్రయం పొందవచ్చునని తెలిపారు.  

ఇంతవరకు  ప్రధాన మంత్రి రిలీఫ్‌ ఫండ్‌ కు రూ.1,50,500/– ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2,18,71,750/– జిల్లా కలెక్టరు సహాయ నిధికి రూ.4,31,66,023/–  వివిధ కంపెనీలు, వ్యక్తులు అందజేశారని, అంతే కాకుండా చాలా మంది వస్తు రూపేణా కూడా సహాయం చేస్తున్నారని విజయసాయిరెడ్డి వివరించారు.
 
తూర్పు గోదావరి జిల్లా:
జిల్లాలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 5 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కోవిడ్‌–19 మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది. జిల్లా నుంచి ఇప్పటి వరకు మొత్తం 1034 శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపగా, 934 నెగటివ్‌గా వచ్చాయి. 17 కేసులు పాజిటివ్‌ రిపోర్టు రాగా, ఇంకా 83 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.
 
కృష్ణా జిల్లా:
కోవిడ్‌–19 నిర్ధారణ కోసం సేకరించే శాంపిల్‌ కోసం కృష్ణా జిల్లా యంత్రాంగం వినూత్న క్యాబిన్‌ను రూపొందించింది. శాంపిల్‌ సేకరించే వ్యక్తి సురక్షితంగా ఉండే విధంగా ఆ క్యాబిన్‌ డిజైన్‌ చేశారు. కలెక్టర్‌ ఏఎండి ఇంతియాజ్‌ ప్రత్యేక శ్రద్ధతో ఈ క్యాబిన్‌కు రూపకల్పన చేశారు.

శాంపిల్‌ సేకరించే వ్యక్తి మోచేతి వరకు గ్లౌజ్‌ ధరించి, అంత వరకు మాత్రమే క్యాబిన్‌ నుంచి చేయి బయటకు పెట్టి, శాంపిల్‌ సేకరించే విధంగా దాన్ని తయారు చేశారు. ఈ క్యాబిన్‌ను ఇవాళ కలెక్టర్‌ ఇంతియాజ్‌ పరిశీలించారు. ఏ మాత్రం రిస్కు లేకుండా, పూర్తి సురక్షిత విధానంలో కేవలం 15 సెకన్లలోనే శాంపిల్‌ సేకరించవచ్చని కలెక్టర్‌ తెలిపారు.
 
గుంటూరు జిల్లా:
జిల్లాలో ఇవాళ కరోనా వైరస్‌ అనుమానిత శాంపిల్స్‌ 58 పరీక్షలకు పంపిస్తే, వాటిలో 5 పాజిటివ్‌గా తేలాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌గా తేలిన కేసుల సంఖ్య 55కు చేరింది. జిల్లా నుంచి ఇప్పటి వరకు 1059 శాంపిల్స్‌ పరీక్షలకు పంపిస్తే 781 కేసులు నెగటివ్‌గా గుర్తించారు. ఇంకా 223 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. 
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారిలో ఇంకా 808 మంది గృహ నిర్భంధంలో ఉన్నారు.

ఐసొలేషన్‌లో 104 మంది ఉండగా, 153 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలోని 68 క్వారంటైన్‌ కేంద్రాలలో మరో 646 మంది ఉండగా, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:
జిల్లాలో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. జిల్లా నుంచి ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ అనుమానిత 640 శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, 480 శాంపిల్స్‌ నెగటివ్‌గా తేలాయి. 48 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా, ఇంకా 112 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. 

జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారిని ట్రాక్‌ చేసి, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉంచారు. వారిలో ఇప్పటికీ 414 మంది గృహ నిర్భంధంలో ఉండగా, మరో 46 మంది ఐసొలేషన్‌లో కొనసాగుతున్నారు. జిల్లాలో 11 క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఇప్పుడు వాటిలో 601 మందిని ఉంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 
చిత్తూరు జిల్లా:
కరోనా వైరస్‌ అనుమానిత కేసులకు సంబంధించి జిల్లాలో మొత్తం 756 శాంపిల్స్‌ పరీక్షలకు పంపగా, వాటిలో 554 కేసులు నెగటివ్‌గా తేలాయి. 20 కేసులను పాజిటివ్‌గా గుర్తించగా, మిగిలిన వాటి ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
జిల్లాలో వివిధ ఆస్పత్రులలో 19 మంది చికిత్స పొందుతుండగా, పూర్తిగా కోలుకున్న ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. 363 మంది ఆస్పత్రి, హోం క్వారంటైన్లలో ఉండగా, వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
 
అనంతపురం జిల్లా:
కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా  ప్రజారోగ్య సంరక్షణతో పాటు డాక్టర్ల రక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని రాష్ట్ర ఆర్థిక మరియు ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు.  అనంతపురం కలెక్టరేట్‌ లోని రెవిన్యూ భవనంలో కోవిడ్‌ –19 పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్‌ నారాయణ, ప్రభుత్వ విప్‌ కాపు  రామచంద్రారెడ్డిలతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి బుగ్గన మాట్లాడుతూ డాక్టర్లకు అండగా ఉంటామని, కరోనా వైరస్‌ వ్యాధిగ్రస్తులకు వైద్యం చేసేందుకు అవసరమైన రక్షణ సామాగ్రిని వారికిఅందిస్తామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారం టైన్‌ కేంద్రాల్లో అన్ని వసతులతో కూడిన సౌకర్యాలను ప్రధానంగా కల్పించాలని ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 క్వారం టైన్‌ కేంద్రాల్లో బయో డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్‌ లు మాత్రమే ఉపయోగించాలన్నారు. ఆయా కేంద్రాల్లో ఉపయోగించిన బెడ్‌ షీట్లు, ఇతర డిస్పోజబుల్‌ మెడికల్‌ వేస్టేజ్‌ సామాగ్రిని బయో వేస్ట్‌ మేనేజ్మెంట్‌ పద్దతిలో వాటిని డిస్పోజ్‌ చేయాలన్నారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు డిఈ ద్వారా డిస్పోజ్‌ చేసే ప్రాంతాన్ని సైట్‌ ఇన్సె్పక్షన్‌ చేయించాలన్నారు. 

క్వారం టైన్‌ కేంద్రాల్లో  సిబ్బంది తో భోజనం తయారు చేయడం కష్టంకాబట్టి, ఒక ఏజెన్సీని గుర్తించి, భోజనం తయారు చేయించాలని అధికారులను ఆదేశించారు. క్వారం టైన్‌ కేంద్రాల్లో బెడ్లు, బెడ్‌ షీట్లు, టూత్పేస్టు, బ్రష్, డెటాల్‌ సోప్, బాకిట్, మగ్గు, న్యూస్‌ పేపర్లు, పుస్తకాలు ఇలా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పారిశుద్ధ్య చర్యలు పక్కాగా పాటించాలని, ఆ కేంద్రాల్లో బాత్రూం తో సహా మరుగుదొడ్లను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. క్వారం టైన్‌ కేంద్రాల్లో బాగా పనిచేసే నోడల్‌ ఆఫీసర్‌ ను నియమించాలన్నారు. సెమీ పిపి ఈ, హెచ్‌ ఐవి కిట్లను క్వారం టైన్‌ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని మంత్రి రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.
 
వైయస్సార్‌ కడప జిల్లా:
జిల్లాలో కొత్తగా పాజిటివ్‌ కేసు ఏదీ నమోదు కాలేదు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ అనుమానిత శాంపిల్స్‌ 1136 పరీక్షలకు పంపగా, వాటిలో 752 నెగటివ్‌గా వచ్చాయి. 29 కేసులు పాజిటివ్‌గా గుర్తించగా, ఇంకా 384 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది.

విదేశాల నుంచి జిల్లాకు 4941 మంది రాగా, వారిలో చాలా మందిని ట్రాక్‌ చేశారు. వారిలో 4016 మంది 28 రోజుల గృహ నిర్భంధం పూర్తి కాగా, ఇంకా 925 మంది స్వీయ గృహ నిర్భంధంలో ఉన్నారు.
 
కర్నూలు జిల్లా:
కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ లో భాగంగా  ప్రభుత్వ క్వారంటైన్‌లలో 14 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తులను డిశ్చార్జ్‌  చేసేందుకు కోవిడ్‌–19 ప్రోటోకాల్‌ ప్రకారం ప్రత్యేక వైద్య నిపుణుల బృందం తక్షణం సమావేశమై నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ భవనంలో నెగటివ్‌ కేసులు, 14 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తుల డిశ్చార్జ్‌ అంశంపై సంబంధిత వైద్య అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జి. వీరపాండియన్‌ మాట్లాడుతూ కోవిడ్‌–19 ప్రోటోకాల్‌ ప్రకారం విదేశాల నుంచి, ఢిల్లీ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌లకు సంబందించి ప్రభుత్వ క్వారంటైన్‌లలో 14 రోజులు పూర్తి చేసుకున్న వ్యక్తుల హెల్త్‌ స్క్రీనింగ్,  ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకొని డిశ్చార్జ్‌  చేయాలో  వైద్య నిపుణుల బృందం సమీక్షించి సంబంధిత నివేదికలు అందజేయాలని సూచించారు.

డిశ్చార్జ్‌  అయిన తర్వాత కూడ మరో 14 రోజులు పాటు ఎవరిని కలవకుండా హౌస్‌ క్వారంటైన్‌ లలో ఉండేలా తగు తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్‌ తెలిపారు. పాజిటివ్‌ కేసులు ఉన్న వ్యక్తులు నెగిటివ్‌ వ్యక్తులతో కలవకుండా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు కర్నూలు, నంద్యాల పట్టణ ప్రాంతాలలోని టిడ్కో  హౌజింగ్‌ కాలనీలలో ప్రత్యేక గదులు ఉండే రెండు వేల ఇళ్లలో యుద్ధ ప్రాతిపదికన అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చి సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్‌ తెలిపారు.