కరోనా కర్ఫ్యూ కేసులు, జనం జేబులు ఖాళీ
కరోనా దెబ్బకి కుదేలు అయిపోయిన ప్రజల నెత్తిన కరోనా కర్ఫ్యూ కేసులు భారంగా మారాయి. గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ సెకండ్ వేవ్‌తో కర్ఫ్యూ మొదలైంది. పూర్తి కర్ఫ్యూ మొదలుకొని చివరికి ఉదయం ఆరు నుంచి సాయంత్రం 6 వరకు సడలింపుల వరకు సామాన్య ప్రజల నెత్తిన కర్ఫ్యూ చేదు అనుభవాలనే మిగిల్చింది.
ఒక పక్క పని చేసుకునే దారి లేక, మరో పక్క రోడ్డుపైకి వస్తే, పోలీసుల లాఠీ దెబ్బలకు తోడు, చలానాలతో తడిసి మోపెడు అయింది. కర్ఫ్యూ ఆంక్షలు, 144 సెక్షన్ నిబంధనలు ఉల్లంఘించారని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు లక్షలాది రూపాయలు చలానాలు విధించారు.
నిన్న ఒక్క రోజులోనే ... ఒక్క విజయవాడలోనే 50 కేసులు నమోదు చేసి, 5,37,895 రూపాయల జరిమానాలు విధించారు. అసలే తమ జీవనానికి కటకటలాడిపోతున్న సామాన్యులు, ఈ చలానాల బాదుడుపై మింగలేక కక్కలేకుండా ఉన్నారు. ఇప్పటికే కర్ఫ్యూ నిబంధనలతో వందలాది వాహనాలు సీజ్ అయ్యాయి.
ఇక జులై 8 నుంచి కర్ఫ్యూ వేళలను ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నారు. దుకాణాలకు మాత్రం రాత్రి 9 గంటల వరకే గడువు ఇచ్చారు. చాలా మంది వ్యాపారులు చలానాల బాధ తట్టుకోలేక అరగంట ముందే తమ వ్యాపారాలను కట్టిపెడుతున్నారు. గతంలో పోలీసులు వచ్చి షాపు బంద్ చేయకపోతే...అదిరించేవారని, కొందరు అయితే, అంతో ఇంతో మామూలు తీసుకుని వదిలేశేవారని వ్యాపారులు చెపుతున్నారు.
ఇపుడు కేవలం పోలీసు సీసీ కెమేరాలలో చూసి, పోలీసు కంట్రోల్ రూమ్ నుంచి చలానాలు బాదేస్తున్నారని వాపోతున్నారు. దీనివల్ల షాపు తెరిచి ఉన్నపుడు జరిగే వ్యాపారం కన్నా, చలానాల సొమ్ము ఎక్కువ కట్టాల్సి వస్తోందని విజయవాడలో హోల్ సేల్ కిరాణా వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ కరోనా బాధలు ఎప్పటికి తీరతాయో అని తలలు పట్టుకుంటున్నారు.